Dodda Padma | తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో కీలక భూమిక పోషించిన దొడ్డా పద్మ (99) కన్నుమూశారు. ఈ నెల 25న సూర్యాపేట జిల్లా చిలుకూరులో ఆమె స్వగృహంలో కాలు జారి కిందపడటంతో తుంటి ఎముకకు ఫ్రాక్చర్ అయింది. ఈ క్రమంలో హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించగా.. పరిస్థితి విషమించడంతో మంగళవారం రాత్రి తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని ఆమె కుమార్తె కల్పన వెల్లడించారు.
ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా ఎ.కొండూరు మండలం అట్లప్రగడకు చెందిన ప్రముఖ కమ్యూనిస్టు నేత దివంగత కాట్రగడ్డ రంగయ్య, అన్నపూర్ణ దంపతుల కుమార్తె పద్మ. చిన్ననాటి నుంచే కమ్యూనిస్టు ఉద్యమాలు, పోరాటాల్లో కీలక భూమిక పోషించారు. నాటి నిజాం పాలనకు వ్యతిరేకంగా ఆమె చురుగ్గా పాల్గొన్నారు. ఆమె భర్త హుజూరాబాద్ మాజీ ఎమ్మెల్యే, సీపీఐ నాయకుడు దొడ్డా నర్సయ్య కూడా ప్రముఖ స్వాతంత్య్ర సమరయోదుడు, తెలంగాణ సాయుధ పోరాటయోధుడు.