Digital Arrest Scam : దేశంలోనే అతిపెద్ద డిజిటల్ అరెస్టుల్లో ఒకటైన ఘటన ఇటీవల జరిగింది. ఢిల్లీకి చెందిన ఒక వృద్ధ జంటను డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి, వారి వద్ద ఉన్న రూ.14.5 కోట్లను నిందితులు కొల్లగొట్టారు. ఈ ఘటనపై విచారణ జరుపుతున్న పోలీసులు తాజాగా నిందితుల్ని అరెస్టు చేశారు. ఢిల్లీలోని ఓం తనేజా, ఇందిరా తనేజా అనే వృద్ధులు వైద్యులుగా పని చేసి రిటైరయ్యారు.
ఢిల్లీలో పలు సోషల్ సర్వీస్ చేస్తున్నారు. అయితే, వారిని నిందితులు డిజిటల్ అరెస్ట్ పేరుతో బెదిరించి, వారి వద్ద నుంచి ఆన్లైన్లో రూ.14.8 కోట్లు కొట్టేశారు. గత డిసెంబర్ నుంచి వారిని డిజిటల్ అరెస్ట్ చేసి, దాదాపు 17 రోజుల్లో ఈ మొత్తం కొట్టేశారు. తాము మోసపోయామని గ్రహించిన ఈ జంట తర్వాత పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది చాలా పెద్ద మోసం కావడంతో పోలీసులు వేగంగా స్పందించారు. నిందితుల్ని పట్టుకున్నారు. ఈ నెల 15న తొలి నిందితుడిని గుజరాత్లో అరెస్టు చేశారు. ఇప్పటివరకు మొత్తం 8 మందిని అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుల్లో ఎక్కువ మంది విద్యావంతులే కావడం విశేషం. ఒకరు సీఏ చదవాలనుకున్నారు.
మరొకరు న్యూజిలాండ్‌లో ఐటీలో డిప్లొమా చేశారు. ఇంకొకరు ఎంబీయే, మరొకరు ప్రైవేట్ ట్యూటర్, ఒకరు సన్యాసి. వీరికి కంబోడియా, నేపాల్ నుంచి కూడా కొందరు సహకరిస్తున్నారు. అక్రమంగా సంపాదించిన ఈ సొమ్మును 1,000 బ్యాంకు అకౌంట్లకు నిందితులు ట్రాన్స్ఫర్ చేసినట్లు గుర్తించారు. ఒకేసారి పెద్ద మొత్తంలో పంపిస్తే దొరికిపోతామని గ్రహించి, ఈ పద్ధతికి తెరతీశారు. ప్రస్తుతం పోలీసులు డబ్బు రికవరీ చేసే అవకాశాల్ని పరిశీలిస్తున్నారు.