హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ) : సర్పంచులకు పెండింగ్ బిల్లులు మంజూరు అంటూ రాష్ట్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అవాస్తవమని తెలంగాణ సర్పంచుల సంఘం జేఏసీ ఆక్షేపించింది. రాష్ట్ర ప్రభుత్వం బుధవారం విడుదల చేసిన రూ.153 కోట్ల నిధులతో సర్పంచులకు ఎలాంటి ప్రయోజనం లేదని, ఎస్డీఎఫ్ నిధులు కాంట్రాక్టర్లు చేసిన బిల్లులే తప్ప సర్పంచులు పనులు చేసిన బిల్లులు కావని పేర్కొన్నది.
రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు రావాల్సిన బకాయి నిధుల వివరాలు ప్రభుత్వం వద్ద ఉన్నాయని, వాటిని విడుదల చేయాలని కోరుతూ సచివాలయంలో గురువారం పంచాయతీరాజ్‌శాఖ ముఖ్యకార్యదర్శి లోకేశ్‌కుమార్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో ఆ జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సుర్వి యాదయ్యగౌడ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాంపాక నాగయ్య, ఉపాధ్యక్షుడు కేశబోయిన మల్లయ్య, కోశాధికారి పూడూరి నవీన్‌గౌడ్, నాయకులు బస్వపురం ఆంజయ్యగౌడ్ పాల్గొన్నారు.
రాష్ట్రవ్యాప్తంగా 12,769 గ్రామపంచాయతీలకుగాను .153 కోట్లు మాత్రమే విడుదల చేయడం ఏమిటని సర్పంచుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు లక్ష్మీనర్సింహారెడ్డి ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా సర్పంచులకు సుమారు రూ.1,200 కోట్ల బకాయిలు ఉన్నాయని, ఎంత శాతం బకాయిలు విడుదల చేశారో ప్రభుత్వం వివరించాలని కోరారు. గ్రామాలవారీగా ఎస్డీఎఫ్, సీడీఎఫ్, ఎస్ఎఫ్సీల ద్వారా చేపట్టిన పనులకు ఎన్ని బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి? ఇప్పటికి ఎంత విడుదల చేశారు? మిగిలినవి ఎన్ని? అనే అంశంపై శ్వేతపత్రం విడుదల చేయాలని గురువారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు.