Inter Student | హైదరాబాద్, మార్చి 6 (నమస్తే తెలంగాణ): ఇంటర్ విద్యార్థి సాత్విక్ ఆత్మహత్యకు కారణమైన నార్సింగి శ్రీచైతన్య కాలేజీపై ఇంటర్‌బోర్డు కఠిన చర్యలు తీసుకొన్నది. ఆ కాలేజీ గుర్తింపును రద్దుచేసింది. వచ్చే విద్యా సంవత్సరంలో ఫస్టియర్ అడ్మిషన్లపై నిషేధం విధించింది. ఈ మేరకు సోమవారం నిర్వహించిన సమావేశంలో అధికారులు ఈ విషయాన్ని వెల్లడించారు. నార్సింగి శ్రీచైతన్య కాలేజీలో ఇంట ర్ ఫస్టియర్ విద్యార్థి ఎన్ సాత్విక్ 6 రోజుల క్రితం ఆత్మహత్య చేసుకొ న్న విషయం తెలిసిందే. దీనిపై సద రు కాలేజీకి ఇంటర్‌బోర్డు నోటీసు జారీచేసింది. విద్యార్థి సాత్విక్ సూ సైడ్ నోట్ ఆధారంగా పోలీసులు క్రిమినల్ కేసు నమోదు చేశారు. విచారణ నివేదిక, ఎఫ్ఐఆర్, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా కాలేజీ గుర్తింపును రద్దుచేస్తున్నట్టు అధికారులు పేర్కొన్నారు.
ఆత్మహత్యల నివారణ చర్యలపై కమిటీ
ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు పటిష్ఠ మార్గదర్శకాలను రూపొందించాలని తెలంగాణ సర్కారు నిర్ణయించింది. ఇంటర్‌బోర్డు సెక్రటరీ నవీన్‌మిట్టల్ నేతృత్వంలో కమిటీ వేయాలని నిర్ణయం తీసుకొన్నది. ఈ కమిటీలో కాలేజీ యాజమాన్యాల నుంచి ఏడుగురు, ముగ్గురు ఇంటర్‌బోర్డు అధికారులు సభ్యులుగా ఉంటారు. కార్పొరేట్ కాలేజీలకు చెందిన ప్రతినిధులు సైతం ఈ కమిటీలో ఉంటారని అధికార వర్గాలు తెలిపాయి. విద్యార్థుల ఆత్మహత్యల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించేందుకు విద్యాశాఖ కార్యదర్శి వాకాటి కరుణ, ఇంటర్‌బోర్డు కార్యదర్శి నవీన్‌మిట్టల్ సోమవారం జూబ్లీహిల్స్‌లోని ఎంసీఆర్హెచ్ఆర్డీలో కాలేజీల యాజమాన్యాలతో సమావేశమయ్యారు. కాలేజీలను లెక్చరర్లు, ప్రిన్సిపాల్స్ మీద వదిలేసి ఏదైనా జరిగిన తర్వాత యజమాన్యాలు తమకేం సంబంధం లేదంటే కుదరదని, క్రిమినల్ కేసులు ఉంటాయని హెచ్చరించారు.