హైదరాబాద్, జూన్ 23 (నమస్తే తెలంగాణ) : బాలానగర్ సీతాఫలానికి భౌగోళిక గుర్తింపు (జీఐ) ఇవ్వాలని కొండాలక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం కోరింది. ఈ మేరకు సోమవారం దరఖాస్తు చేసింది. ఇది తెలంగాణ నుంచి 19వ జీఐ గుర్తింపు దరఖాస్తు అని వెల్లడించింది. విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ దండ రాజిరెడ్డి మాట్లాడుతూ ఉద్యాన పంటలను రక్షించడానికి కృషి చేస్తున్నామని, నాబార్డ్ కూడా సహాయం చేస్తున్నదని తెలిపారు. త్వరలో మరో ఆరు పంటలకు జీఐ గుర్తింపు కోసం దరఖాస్తు చేస్తామని చెప్పారు. నాబార్డ్ సీజీఎం ఉదయభాస్కర్ స్పందిస్తూ వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను పెంపొందించడానికి కృషి చేస్తున్నామని వెల్లడించారు. బాలానగర్ సీతాఫలానికి జీఐ గుర్తింపు కోసం పనిచేసిన వారిలో డాక్టర్ పిడిగం సైదయ్య, జీఐ ప్రాక్టీషనర్ సుభాజిత్ సాహా, మహబూబ్‌నగర్ డీడీఎం మనోహర్‌రెడ్డి ఉన్నారు.
బాలానగర్ సీతాఫలం మందపాటి తొక, అధిక గుజ్జును కలిగి ఉంటుంది. రుచి, తియ్యదనం ఎక్కువ. దీర్ఘకాలం నిల్వ ఉంటుంది. తాజా వినియోగం, పారిశ్రామిక ప్రాసెసింగ్.. రెండింటికీ అత్యంత అనుకూలంగా ఉంటుంది. దేశంలోని బీడ్ సీతాఫలం (మహారాష్ట్ర), సియోని సీతాఫల్ (మధ్యప్రదేశ్), కాంకేర్ సీతాఫలం (ఛత్తీస్‌గఢ్)లు ఇప్పటికే జీఐ గుర్తింపు పొందాయి.