హైదరాబాద్/సిటీబ్యూరో/న్యూఢిల్లీ, జూన్ 12 (నమస్తే తెలంగాణ): తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురసరించుకొని సోమవారం పోలీస్‌శాఖ నిర్వహించిన తెలంగాణ రన్‌కు రాష్ట్రవ్యాప్తంగా విశేష స్పందన లభించింది. హైదరాబాద్ నగరం మొదలుకొని అన్ని జిల్లాల పరిధిలో జరిగిన ‘తెలంగాణ రన్’కు పెద్ద ఎత్తన ప్రజల నుంచి మద్దతు లభించింది. యువకులు వేలాదిగా తరలివచ్చారు. హైదరాబాద్‌లో ఐదు వేల మందితో నిర్వహించిన పరుగుతో అంబేద్కర్ విగ్రహ పరిసర ప్రాంతాలు, నెక్లెస్‌రోడ్, ట్యాంక్‌బండ్ జనసంద్రంగా మారాయి. మంగ్లీ, రామ్ ల హోరెత్తించే పాటలకు.. నటి శ్రీలీల స్టెప్పులకు యూత్ జోష్ తోడవటంతో ‘తెలంగాణ రన్’ ఓ ప్రత్యేకతను సంతరించుకున్నది.
దేశంలో ఏ రాష్ట్రంలోనూ లేనంతగా.. తెలంగాణ అభివృద్ధి పరుగులు పెడుతున్నదని హోం మంత్రి మహమూద్ అలీ చెప్పారు. అభివృద్ధి పరుగులో తెలంగాణను అందుకోవడం దేశంలోని ఏ రాష్ర్టానికీ సాధ్యం కావడం లేదని అన్నారు. రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా హైదరాబాద్‌లోని నెక్లెస్‌రోడ్‌లో తెలంగాణ పోలీస్‌శాఖ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించిన ‘తెలంగాణ రన్’లో ఆయన మాట్లాడారు. రాష్ట్రాన్ని అభివృద్ధి, సంక్షేమ రంగాల్లో శరవేగంగా ముందుకు తీసుకెళ్లడంలో సీఎం కేసీఆర్ ప్రధాన పాత్ర పోషిస్తున్నారని అభినందించారు. ఆయన కష్టం ఫలితంగానే తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రంగా అవతరించిందని, ఆయన కూడా నంబర్‌వన్ సీఎంగా ఎదిగారని తెలిపారు. క్రీడాశాఖ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ.. అన్నింటా అభివృద్ధి పథాన దూసుకెళ్తున్న మన రాష్ట్రంలోని యువత.. త్వరతిగతిన ఉద్యోగ ఉపాధి అవకాశాలు సాధించుకోవాలని సూచించారు. కార్యక్రమంలో మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, ఎమ్మెల్యే దానం నాగేందర్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, డీజీపీ అంజనీకుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేశ్‌కుమార్, అడిషనల్ డీజీలు విజయ్‌కుమార్, సంజయ్‌కుమార్ జైన్, స్వాతిలక్రా, నాగిరెడ్డి, ఐజీ రమేశ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
ఢిల్లీలో 2కే తెలంగాణ రన్
తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకొని న్యూఢిల్లీలోని తెలంగాణభవన్ వద్ద 2కే తెలంగాణ రన్‌ను సోమవారం నిర్వహించారు. తెలంగాణభవన్ రెసిడెంట్ కమిషనర్ డాక్టర్ గౌరవ్ ఉప్పల్ జెండా ఊపి ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తెలంగాణభవన్‌లో మొదలై ఇండియా గేట్ మీదుగా కొనసాగిన ఈ రన్లో తెలంగాణ భవన్ అధికారులు, సిబ్బంది ఉత్సాహంగా పాల్గొన్నారు.
జిల్లాల్లో ఉత్సాహంగా పరుగు
కామారెడ్డి జిల్లా బాన్సువాడలో నిర్వహించిన తెలంగాణ రన్లో స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి పాల్గొన్నారు. రంగారెడ్డి జిల్లా మీర్‌పేటలో డీసీపీ సాయి శ్రీ ఆధ్వర్యంలో నిర్వహించిన 5కే రన్‌ను విద్యాశాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి ప్రారంభించారు. మహబూబ్‌నగర్‌లో స్టేడియం గ్రౌండ్స్ నుంచి తెలంగాణ చౌరస్తా వరకు నిర్వహించిన తెలంగాణ రన్‌ను క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ ప్రారంభించారు. నల్లగొండలో 2కే రన్‌ను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ప్రారంభించారు. రన్లో నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డి, కలెక్టర్ టీ వినయ్ కృష్ణారెడ్డి, ఎస్పీ అపూర్వరావు ఉత్సాహంగా పాల్గొన్నారు. సూర్యాపేటలో 2కే రన్‌ను విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి ప్రారంభించారు. కొత్తబస్టాండ్ నుంచి సద్దుల చెరువు మినీ ట్యాంక్‌బండ్ వరకు రన్ సాగింది. నిర్మల్‌లో 2కే రన్ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి ప్రారంభించారు.
వనపర్తిలో తెలంగాణ రన్‌ను కలెక్టర్ తేజస్ నందలాల్‌పవార్‌తో కలిసి మంత్రి వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి ప్రారంభించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వారావుపేటలో నిర్వహించిన తెలంగాణ రన్లో ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, ఇల్లెందులో ఎమ్మెల్యే హరిప్రియానాయక్, కొత్తగూడెంలో ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వరరావు, భద్రాద్రి కలెక్టర్ అనుదీప్, ఎస్పీ వినీత్ గంగన్న, ఖమ్మం జిల్లా వైరా పట్టణంలో ఎమ్మెల్యే రాములునాయక్, సత్తుపల్లిలో ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య, మధిరలో ఖమ్మం జడ్పీ చైర్మన్ లింగాల కమల్‌రాజు, ఖమ్మంలో ఎమ్మెల్సీ తాతా మధు, కలెక్టర్ వీపీ గౌతమ్, సీపీ విష్ణు ఎస్ వారియర్ పాల్గొన్నారు.