తెలుగు యూనివర్శిటీ, జూన్ 21: తెలుగు సాహిత్యంలోని వివిధ ప్రక్రియలలోని ఉత్తమ గ్రంథాలకు 2022 సంవత్సరానికి తెలంగాణ సారస్వత పరిషత్తు పురస్కారాలను ప్రకటించింది. రాష్ట్ర స్థాయిలో ఆహ్వానించిన పోటీకి గ్రంథాలపై న్యాయ నిర్ణేతల నివేదిక ఆధారంగా పురస్కారాలను ఎంపిక చేసినట్టు పరిషత్తు అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి, ప్రధాన కార్యదర్శి డాక్టర్ జుర్రు చెన్నయ్య ఒక ప్రకటనలో వెల్లడించారు.
పద్య/గేయ కవితా ప్రక్రియలో డాక్టర్ ఏనుగు నరసింహారెడ్డి రచించిన ‘తెలంగాణ రుబాయీలు’ ఉత్తమ గ్రంథంగా ఎంపికయ్యిందని తెలిపారు. వచన కవిత్వంలో వంశీకృష్ణ రచించిన ‘రెప్పవాలని రాత్రి’, నవలా ప్రక్రియలో మొట్టు మురళీధర్ ‘కనిపించని శత్రువు’ (కరోనా నేపథ్య నవల), సాహిత్య విమర్శలో ఆచార్య వెలుదండ నిత్యానందరావు సమగ్ర సాహిత్యం-1 పురస్కారాలకు ఎంపికయ్యాయి.
కథా ప్రక్రియలో పెద్దింటి అశోక్‌కుమార్ గుండెలో వాన సంపుటి, ఇతర పుస్తకాల్లో తుమ్మూరి రామ్మోహన్రావు మానేరు ముచ్చట్లు పురస్కారాలను పొందినట్టు వివరించారు. అదేవిధంగా తండ హరీశ్‌గౌడ్ రచించిన ఇన్‌బాక్స్ కవితా సంపుటి, స్ఫూర్తి కందివనం రచించిన చైత్య నవల ఈ ఏడాది పురస్కారాలకు ఎంపికయ్యాయి.
రచనానుభవంలో వయస్సులో వరిష్టులకు పుస్తకాలతో నిమిత్తం లేకుండా నలుగురు సాహితీ మూర్తులకు పురస్కారాలు ఇవ్వనున్నట్టు వారు తెలిపారు. ఈ సంవత్సరం డాక్టర్ గండ్ర లక్ష్మణరావు, డాక్టర్ నాళేశ్వరం శంకరం, డాక్టర్ భూపాల్, జ్వలితలను ఈ పురస్కారాలకు ఎంపిక చేసినట్టు వివరించారు.
ఉత్తమ గ్రంథ పురస్కారాలు, వరిష్ట పురస్కారాలకు ఎంపికైన వారికి ఒక్కొక్కరికి 20 వేల రూపాయలు, యువ పురస్కారాలకు 10 వేల రూపాయల నగదుతో పాటు సన్మానిస్తామని తెలిపారు.