పశ్చిమాసియా యుద్ధం మరిన్ని కష్టాలను తీసుకొస్తున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే చమురు, వంటగ్యాస్ సరఫరాకు ఎదురైన అవాంతరాలు, ప్రజల జీవితాలపై ప్రతికూల ప్రభావం వంటి పరిణామాలు చూశాం. ఇప్పుడు మరో ప్రమాదం పొంచి ఉన్నదని తెలుస్తున్నది. తాజాగా వ్యవసాయ, ఆర్థిక, ఆహార రంగాల నిపుణుల విశ్లేషణలు ఇందుకు బలం చేకూర్చుతున్నాయి. మరి ఆ ప్రభావం ఎలా ఉండబోతున్నది? అనేది సర్వత్రా ఉత్కంఠగా మారింది. ఇది దేశంపై సుమారు రూ.3 లక్షల కోట్ల విలువైన నష్టాన్ని కలిగిస్తుందని అంచనా.
దేశంలో ఎల్ నినో ప్రభావంతో వర్షాలు తక్కువ పడుతాయని, ఫలితంగా కరవు పరిస్థితులు నెలకొంటాయని వాతావరణ శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో పశ్చిమాసియా యుద్ధ ప్రభావం రూపంలో మరో కష్టం వచ్చి పడే పరిస్థితులు కనిపిస్తున్నాయి. అమెరికా-ఇజ్రాయెల్, ఇరాన్ యుద్ధం కారణంగా అత్యంత కీలకమైన హొర్ముజ్ జలసంధి వద్ద నౌకా రవాణాకు అంతరాయం ఏర్పడిన సంగతి తెలిసిందే. దిగుమతులకు కీలకమైన మార్గం కావడంతో ఎరువుల సరఫరాపైనా ప్రభావం పడింది. అటు వర్షాభావం, ఇటు ఎరువుల కొరత కలిపి వ్యవసాయ ఉత్పత్తిపై ప్రభావం పడుతుంది కాబట్టి, మొత్తంగా ఆహార ద్రవ్యోల్బణం సంభవించవచ్చని నిపుణులు చెప్తున్నారు.
భారత వ్యవసాయ మార్కెట్ రెండు కీలకమైన, అంచనా వేయలేని అంశాలపై ఆధారపడి ఉంటుది. ఒకటి ఆకాశం, రెండు సముద్రం. కానీ ఈ సంవత్సరం రైతులు రుతుపవనాల కోసం ఆకాశం వంక చూస్తుంటే, మార్కెట్ వర్గాలు 2000 కిలోమీటర్ల దూరంలోని సముద్ర మార్గంపై చూస్తున్నాయి. సాధారణంగా వ్యవసాయ, మార్కెట్ వర్గాలకు చెందిన ఎవరైనా మంచి వర్షాలు పడాలని కోరుకుంటారు, కానీ ఈ సారి హొర్ముజ్ జలసంధి వద్ద శాంతియుత పరిస్థితులు నెలకొనాలని కూడా ప్రార్థించాల్సిన అవాంచనీయ పరిస్థితులు నెలకొన్నాయి.
ప్రపంచంలో అధికంగా ఎరువులు వాడుతున్న రెండో అతిపెద్ద దేశం.. భారత్. ముడి పదార్ధాలు, తయారైన ఎరువుల కోసం భారత్ ప్రధానంగా విదేశాల నుంచి వచ్చే దిగుమతులపై ఆధారపడుతున్నది. వీటిలో ఎక్కువ భాగం హొర్ముజ్ జలసంధి మీదుగా రావాల్సి ఉంటుంది. కానీ పశ్చిమాసియా యుద్ధంతో హొర్ముజ్ వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా సరఫరాకు అంతరాయం ఏర్పడింది. కాబట్టి ఈ సారి వ్యవసాయ దిగుబడులు పడిపోయి, ఆహార ధరలు పెరుగుతాయనే ఆందోళన వ్యక్తమవుతున్నది. ఇదే సమయంలో భారత వాతావరణశాఖ (ఐఎండీ) గత వారం రుతుపవనాలపై కీలకమైన ప్రకటన విడుదల చేసింది. భూమధ్యరేఖ వద్ద పసిఫిక్ మహాసముద్రంలో ఎల్ నినో బలపడుతున్నదని స్పష్టంచేసింది. 2026లో సాధారణం కంటే తక్కువ వర్షపాతం నమోదవుతుందని తెలిపింది. పదేండ్లలో ఎప్పుడూ లేనంత స్థాయిలో తక్కువ వర్షాలు కురుస్తాయని నిపుణులు చెప్తున్నారు.
ప్రస్తుతం వరి, మక్క, సోయాబీన్ పంట యాసంగి పంట నాట్ల సమయం. కాబట్టి ప్రభుత్వాలు తక్షణమే గ్లోబల్ టెండర్ల ద్వారా యూరియాను సమకూర్చుకోవాల్సిన అనివార్యమైన పరిస్థితి నెలకొన్నది. బ్లూంబర్గ్ నివేదిక ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా మొత్తం యూరియాలో పర్షియన్ గల్ఫ్ నుంచే 45 శాతం సరఫరా అవుతాయి. కాబట్టి ప్రపంచ వ్యాప్తంగా కూడా ధరలు పెరిగాయి. భారత్ ఇటీవల 25 లక్షల టన్నుల యూరియాను సాధారణం కంటే రెట్టింపు ధరతో కొనుగోలు చేసింది.
ఇటీవల ప్రధాని నరేంద్రమోదీ ప్రజలకు పొదుపు మంత్రం సూచించారు. ప్రజలు పెట్రోల్, డీజిల్‌తో పాటు రసాయ ఎరువుల వాడకాన్ని కూడా తగ్గించాలని కోరారు. ప్రజలు రసాయనాల వాడకం తగ్గించి, సహజ పద్ధతుల్లో వ్యవసాయం చేయాలని చెప్పారు. ప్రధాని చేసిన సూచన, దేశ ఆర్థిక పరిస్థితికి అద్దం పడుతున్నది. బంగారం, ముడి చమురుతోపాటు విదేశీ రసాయనాల వల్ల కూడా భారతదేశ దిగుమతి బిల్లులు, వాణిజ్య లోటు గణనీయంగా పెరుగుతున్నాయి. ఎరువుల దిగుమతికి భారత్ 2025-26 ఆర్థిక సంవత్సరంలో 27 బిలియన్ డాలర్లు వెచ్చించింది. పశ్చిమాసియా సంక్షోభం ఏడాది పొడవునా కొనసాగితే ఈ మొత్తం 33 బిలియన్ డాలర్లకు పెరిగే అవకాశమున్నది.
మరోవైపు చమురు దిగుమతుల భారం కూడా పెరుగుతున్నది. ఒక బ్యారెల్ చమురు ధర 10 డాలర్లు పెరిగితే భారత దిగుమతి బిల్లుపై 18 బిలియన్ డాలర్ల అదనపు భారం పడుతుంది. ఫలితంగా ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో కరెంట్ ఖాతా లోటు జీడీపీలో 1.5 శాతం నుంచి 2 శాతం వరకు పెరిగే అవకాశమున్నది. విదేశీ కంపెనీల పెట్టుబడుల ఉపసంహరణ వల్ల మరో 17-18 బిలియన్ డాలర్ల అదనపు ఒత్తిడి ఏర్పడుతున్నది. దీంతో బ్యాలెన్స్ ఆఫ్ పేమెంట్స్ లోటు 50 బిలియన్ డాలర్ల నుంచి 65 బిలియన్ డాలర్ల వరకు చేరే ప్రమాదమున్నది. అంటే, వరుసగా మూడో ఏడాది కూడా లోటులోకి వెళ్లే ఆందోళనకరమైన పరిస్థితి నెలకొన్నది. మరోవైపు డాలర్‌తో పోల్చితే రూపాయి మారకం విలువ ఈ ఏడాది రూ.85 – రూ.95కు పడిపోయింది. సంక్షోభం ఇలాగే కొనసాగితే రూ.100 మార్క్ దిశగా దూసుకెళ్లే పరిస్థితి కనిపిస్తున్నది.
ప్రస్తుత ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో విదేశీ ఎరువుల కొనుగోలు ప్రభుత్వానికి ఓ సవాల్, ఆ భారం రైతులపై పడకుండా చూడటం మరో సవాల్. ఇటీవల పశ్చిమాసియా ఉద్రిక్తతల వల్ల యూరియా, డీఏపీ దిగుమతి ధరలు మెట్రిక్ టన్నుకు దాదాపు 950 డాలర్లకు చేరాయి. అంటే, యుద్ధం కంటే ముందు ధరలతో పోల్చితే యూరియా 139 శాతం, డీఏపీ 39 శాతం పెరిగింది. ఎల్ఎన్జీ ధరలు ఎంఎంబీటీయూకు 20 డాలర్లు పెరిగాయి. దీంతో నెలవారీ సబ్సిడీ తగ్గి ధరలు అధికమయ్యాయి. ఈ అధిక ధరలు వర్షాకాలమంతా కొనసాగితే సుమారు రూ.40 వేల కోట్ల నుంచి రూ.60 వేల కోట్ల వరకు భారం పడే అవకాశాలు ఉన్నాయని నిపుణులు చెప్తున్నారు. ఈ మొత్తం భారాన్ని అంచనా వేస్తే సుమారు రూ.3 లక్షల కోట్ల అదనపు వ్యయం కానున్నదని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. ఎరువులపై కేంద్ర ప్రభుత్వ సబ్సిడీ వ్యయం రూ.2.75 లక్షల కోట్ల నుంచి రూ.3 లక్షల కోట్ల వరకు ఉంటుందని క్రిసిల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ అభిప్రాయం వ్యక్తంచేశారు.
ఎరువుల ధరల పెరుగుదలతోపాటు దిగుమతుల కొరత కొనసాగితే రానున్న నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం పెరిగే ప్రమాదమున్నది. హొర్ముజ్ వద్ద ఉద్రిక్తత పరిస్థితులతో ప్రతినెలా 30 నుంచి 40 లక్షల టన్నుల ఎరువుల వాణిజ్యం నిలిచిపోయింది. ఈ సీజన్‌కు సరిపడా ఎరువులు ఉన్నట్టు కేంద్ర ప్రభుత్వ ప్రతినిధులు చెప్తున్నప్పటికీ, ఉద్రిక్తతలు కొనసాగితే రబీ నాటికి ఎరువుల సంగతి ఎలా అని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మరోవైపు ఎల్‌నినో ప్రభావంతో వర్షపాతం తగ్గితే పరిస్థితి మరింత దిగజారవచ్చు. 2023లో వర్షాల కొరతతో ఆహార ద్రవ్యోల్బణం 11.5 శాతానికి చేరింది. ఇప్పుడూ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో రానున్న రోజుల్లో ఆహార కొరత ఏర్పడి, ధరలు పెరిగే ప్రమాదం ఉన్నది.
(‘ది ఎకనమిక్ టైమ్స్’ సౌజన్యంతో)
– ఎడిటోరియల్ డెస్క్