హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ) : తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్ మోగింది. వచ్చేనెల 6వ తేదీ అర్ధరాత్రి నుంచి సమ్మె చేయనున్నట్టు ఆర్టీసీ కార్మిక సంఘాల జేఏసీ వెల్లడించింది. ఆర్టీసీ కార్మికుల సమస్యల పరిష్కారం కోసం జనవరి 27న ఇచ్చిన సమ్మె నోటీసుపై సంస్థ యాజమాన్యం, ప్రభుత్వం, లేబర్ కమిషనర్ నుంచి ఎటువంటి స్పందన రాకపోవడంతో సోమవారం ‘చలో లేబర్ కమిషనర్ ఆఫీస్’ చేపట్టామని జేఏసీ నేతలు తెలిపారు. అయినప్పటికీ ఆర్టీసీ యాజమాన్యంలో ఎలాంటి స్పందన లేకపోవడంతో మే నెల 6 నుంచి సమ్మెకు దిగుతున్నట్టు చెప్పారు. వచ్చేనెల 7వ తేదీన తెల్లవారు జాము నుంచే ఎక్కడి బస్సులు అక్కడే డిపోలకే పరిమితమవుతాయని జేఏసీ చైర్మన్ ఈదురు వెంకన్న, కో-చైర్మన్ కే హన్మంత్ ముదిరాజ్, వైస్ చైర్మన్ ఎం థామస్‌రెడ్డి, కన్వీనర్ ఎండీ మౌలానా, కో-కన్వీనర్లు కత్తుల యాదయ్య, సుద్దాల సురేశ్, బీ యాదగిరి తెలిపారు. తమ సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం ముందుకు రాకపోవడంపై కార్మికులు లేబర్ కమిషనర్ ఆఫీసు ఎదుట నిరసన తెలిపారు. ‘ఆర్టీసీ యాజమాన్యం డౌన్‌డౌన్’ అంటూ నినాదాలు చేస్తూ.. చప్పట్లు కొడుతూ హోరెత్తించారు. ఇక ఆర్టీసీ యాజమాన్యం చర్చలకు రాకపోవడం వల్లనే 6వ తేదీ అర్ధరాత్రి నుంచే సమ్మె చేపడుతున్నట్టు తెలుపుతూ జాయింట్ లేబర్ కమిషనర్ సునీతా గోపాల్‌దాస్‌కు లేఖను సమర్పించారు.
లేబర్ కమిషనర్ ఆఫీసులో జరిగిన సమావేశాన్ని ఉద్దేశించి జేఏసీ నాయకులు మాట్లాడారు. డిమాండ్లు సాధించేందుకు చేస్తున్న ఈ పోరాటంలో అన్ని కార్మిక సంఘాలు కలిసిరావాలని పిలుపునిచ్చారు. సమ్మె నోటీసులో 21 అంశాలు ప్రస్తావించామని, ఆ సమస్యల పరిషారం కోసం ప్రభుత్వ, యాజమాన్యాలను ఎన్నో విధాలుగా ఒత్తిడి చేసినా వారినుండి స్పందన రాలేదని అన్నారు. ఆర్టీసీ కార్మికుల ను ప్రభుత్వంలో విలీనం చేస్తామని కాంగ్రెస్ పార్టీ హామీ ఇచ్చినా.. నేటివరకు ఆ సమస్య ఓ కొలికి రాలేదని విమర్శించారు. ట్రేడ్ యూనియన్లను పునరుద్ధరిస్తామని ఎన్నికల సమయంలో హామీనిచ్చినా ఇంతవరకు నెరవేర్చలేదని అన్నారు. ట్రేడ్ యూనియన్ల ప్రాతినిధ్యం లేకపోవడం వల్ల వేధింపులకు గురవుతున్నారని పేర్కొన్నారు.
2017లో వేతన సవరణ జరిగినా ఇంతవరకు బకాయిలు రాకపోవటం విచారకరమని జేఏసీ నేతలు ఆవేదన వ్యక్తంచేశారు. వాటి ఫిక్సేషన్లు జరిపి వెంటనే ఎరియర్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నేటికీ పాత అలవెన్స్లనే అమలు చేస్తూ కార్మికుల శ్రమశక్తిని యాజమాన్యం దోచుకుంటున్నదని విమర్శించారు. 2021 వేతన సవరణ కాలపరిమితి ముగిసినందున వెంటనే వేతన సవరణ జరిపి కార్మికులను ఆర్థికంగా ఆదుకోవాలన్నారు.
ఎలక్ట్రిక్ బస్సులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఆర్టీసీకి సరఫరా చేయాలని జేఏసీ నేతలు కోరారు. ఎలక్ట్రిక్ బస్సులను మాన్యుఫాక్చరర్ నుంచి హైర్ బేసిస్‌లో తీసుకోవటం వల్ల సంస్థ ఉనికి ప్రమాదంలో పడుతుందని హెచ్చరించారు. రిక్రూట్మెంట్ లేకపోవటం వల్ల ఉద్యోగులపై పనిభారం పెరుగుతున్నదని తెలిపారు. సీసీఎస్, పీఎఫ్‌లకు ఇవ్వాల్సిన నిధులను యాజమాన్యం వెంటనే చెల్లించాలని కోరారు.
జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు లేబర్ కమిషనర్ ఆఫీస్‌కు బయల్దేరిన కార్మికులను అరెస్టు చేయడం అన్యాయమని నాయకులు విమర్శించారు. యాజమాన్యాలు కార్మికులను భయభ్రాంతులకు గురి చేయడం తగదన్నారు. ఖమ్మం, సత్తుపల్లి, కొత్తగూడెం, చెంగిచెర్ల, హకీంపేట, కూకట్పల్లి, ఇబ్రహీంపట్నం ఇంకా అనేక చోట్ల అక్రమ అరెస్ట్‌లు చేయడాన్ని ఖండించారు. ఈ కార్యక్రమంలో ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు ఎస్ బాబు, చీఫ్ వైస్ ప్రెసిడెంట్ ఎం వెంకటిగౌడ్, రాష్ట్ర కార్యదర్శి కే భాసర్‌రావు, బీ జ్యోతి, ఎంఏ మాజిద్, టీఎంయూ నాయకులు ప్రెసిడెంట్ ఏఆర్ రెడ్డి, వరింగ్ ప్రెసిడెంట్ కమలాకర్‌గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు సీహెచ్‌బీ రెడ్డి, జీబీఆర్ రెడ్డి, స్టేట్ సెక్రటరీ శ్రీనివాస్, టీజేఎంయూ అడిషనల్ జనరల్ సెక్రటరీ ప్రేమ్‌నాథ్, ఎన్ఎంయూ నాయకులు గ్రేటర్ హైదరాబాద్ జోనల్ సెక్రటరీ వల్లూరి బాబు, రాష్ట్ర సెక్రటరీ కేఎస్ పాల్ తదితరులు పాల్గొన్నారు.