హైదరాబాద్, ఏప్రిల్ 6 (నమస్తే తెలంగాణ) : తెలంగాణ ఆర్టీసీ కార్మికులకు యాజమాన్యం పొమ్మనలేక పొగ పెడుతున్నది. ఆర్టీసీ ప్రగతి రథ చక్రాలను ఊరూరా, వాడవాడలా తిప్పి.. సంస్థ అభ్యున్నతికి కృషి చేసిన డ్రైవరన్నలు, ఇతర మెకానిక్ సిబ్బందిని డిప్యుటేషన్ల పేరుతో బలవంతంగా జిల్లాలకు బదిలీ చేస్తున్నది. హైదరాబాద్ రీజియన్‌లో వేలాదిగా ప్రవేశిస్తున్న ఎలక్ట్రిక్ బస్‌లతో.. ఆర్టీసీ డ్రైవర్లను నచ్చితే కండక్టర్లుగా, లేకుంటే బస్‌పాస్ కౌంటర్లలో సిబ్బందిగా పనిచేయాలని అధికారిక ఆదేశాలు వెలువడినట్టు తెలిసింది. గత 20 ఏండ్లకు పైగా ఉన్న అనుభవాన్ని రోడ్డునపడేసి, నచ్చిన చోటికి వెళ్లాలని, దీనిపై ఈ నెల 15లోపు.. స్పష్టతనివ్వాలని ఆదేశించింది. మహానగరం రోడ్లపై కొన్నేండ్లపాటు బస్సులు నడిపిన ఆర్టీసీ డ్రైవర్లు.. ఎలక్ట్రిక్ బస్‌ల వల్ల వేలల్లో రోడ్డున పడుతున్నారు. మొదటి విడతలో డ్రైవర్లు, మెకానిక్‌ల సంఖ్య అధికంగా ఉంటే.. రెండో దశలో సూపర్వైజర్లు, అకౌంట్స్, సెక్యూరిటీ వంటి విభాగాల్లో విధులు నిర్వర్తించే వారిపై వేటు పడవచ్చని ఆర్టీసీ వర్గాలు అంటున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఒక్క హైదరాబాద్ రీజియన్‌లోని అన్ని డిపోలు, బస్‌భవన్‌లో మొత్తం సుమారు 9వేల మందిపై వేటు పడే అవకాశం ఉందని చెబుతున్నారు.
ఎలక్ట్రిక్ బస్‌లను ప్రోత్సహిస్తూ.. ఆర్టీసీ బస్సులను ఓఆర్ఆర్ బయటికి పంపేస్తున్న క్రమంలో ఒక్క హైదరాబాద్ రీజియన్‌లోనే సుమారు 4,500 మంది డ్రైవర్లపై విడతల వారీగా డిప్యుటేషన్ వేటు వేయనున్నారు. ఈ నిర్ణయంతో డ్రైవర్లతో పాటు భారీగా నష్టపోతున్న వర్గంలో గ్యారేజీల్లో విధులు నిర్వర్తించే మెకానిక్‌లు ఉన్నారు. వారిలోనూ 3,500 మంది వరకూ ఇతర రీజియన్లకు వెళ్లనున్నారు. వారు ఇచ్చే మూడు ఆప్షన్లలో నచ్చిన చోటికి వెళ్లలేని వారు.. వారి విద్యార్హత ఆధారంగా ఏడీఎస్లుగా, బస్‌పాస్ కౌంటర్లలో సిబ్బందిగా, పార్కింగ్ డ్రైవర్లుగా దరఖాస్తు చేసుకోవచ్చని ఆర్టీసీ ఎండీ చెప్పారు. ఆర్టీసీకి డ్రైవర్లుగా చేసిన వారు కూడా వారికి నచ్చితే కండక్టర్లుగా వెళ్లొచ్చనే నిబంధనలు పెట్టారు. ఉన్నపళంగా ఏ రీజియన్‌కు వెళ్లాలో తెలియక, కుటుంబాలను కూడా ఎలా వెంట తీసుకెళ్లాలో తెలియక, ఇప్పటికిప్పుడు ఏం చేయాలో పాలుపోక డ్రైవర్లు, మెకానిక్‌లు తీవ్ర ఆందోళనలో పడ్డారు.
ఆర్టీసీలోకి ఎలక్ట్రిక్ బస్‌ల రాకతో వేల సంఖ్యలో డ్రైవర్లు, మెకానిక్‌లు ఉనికి కోల్పోనున్నారు. వారు ఆర్టీసీలోనే కొనసాగాలంటే కచ్చితంగా కండక్టర్ ఉద్యోగం చేయాల్సిన పరిస్థితిని కల్పించారు. వారి చేతికి ఇప్పటికే టికెట్లు జారీచేసే టిమ్ మిషన్లు అప్పగిస్తున్నారు. హైదరాబాద్ మహానగరంలో కేవలం ఆర్టీసీ బస్‌ల వల్లే వాయు కాలుష్యం ఏర్పడుతున్నదా? అని ప్రశ్నిస్తున్నారు. దేశంలో మొత్తం 42 కోట్ల వాహనాలుంటే అందులో ద్విచక్ర వాహనాలు 30 కోట్లు, కార్లు, జీపులు 5 కోట్లు, లారీలు, బస్‌లు వంటివి 7 కోట్లు ఉండగా.. వాటిల్లో ఆర్టీసీ బస్సులు కేవలం 1,40,000 మాత్రమేనని అంటున్నారు. ప్రభుత్వం నిజంగా పర్యావరణాన్ని రక్షించాలనే ఉద్దేశంతో కర్బన ఉద్గారాలను తగ్గించాలనుకుంటే వ్యక్తిగత వాహనాలు తగ్గించి ప్రజారవాణాను ప్రోత్సహించాలని సూచిస్తున్నారు. నీతి ఆయోగ్ లెకల ప్రకారం మన దేశంలో ఆర్టీసీ వాహనాల శాతం కేవలం 0.033 శాతం మాత్రమేనని అంటున్నారు. కానీ, పాలకులు ఆర్టీసీల విస్తరణను అడ్డుకొనే క్రమంలో పర్యావరణ పరిరక్షణ పేరుతో ప్రైవేట్ పరం చేస్తున్నాయని మండిపడుతున్నారు.
కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న ఎలక్ట్రిక్ బస్సుల విధానంలో మార్పులు చేసి, ఆర్టీసీకే ఇవ్వాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. వేల మంది ఉద్యోగులు రోడ్డు పడుతున్న తరుణంలో.. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం విడ్డూరంగా ఉన్నదని మండిపడుతున్నాయి. ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పించేందుకు ఎందుకు సుముఖత చూపడం లేదని నేతలు ప్రశ్నిస్తున్నారు. కార్పొరేట్లకు ఇచ్చే సబ్సిడీలు ఆర్టీసీకి ఇస్తే.. వారే నేరుగా ఎలక్ట్రిక్ బస్‌లను కొనుగోలు చేస్తారని, ఉద్యోగులెవ్వరినీ తీసేయాల్సిన అవసరం ఉండదని సూచిస్తున్నారు. కేంద్రంలో బీజేపీ విధానాలకు వ్యతిరేకంగా పోరాడలేని తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యమంత్రి ఎందుకని ప్రశ్నిస్తున్నారు. మన ఆర్టీసీ ఉద్యోగులను కాపాడుకొనేందుకు ఆ బస్‌ల కొనుగోలుకు అవసరమైన నిధులను ప్రభుత్వమే సమకూర్చాలని అంటున్నారు. ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం సంస్థను పూర్తిగా ప్రైవేట్‌పరం చేసేందుకు కుయుక్తులు పన్నారని, అందులో భాగంగానే డిప్యుటేషన్లు తీసుకొచ్చారని మండిపడుతున్నారు. ఎలక్ట్రిక్ బస్‌ల విధానంలో మార్పులు చేయకపోతే ఆర్టీసీ తమ మనుగడ సాగించడం కష్టమని ఆవేదన వ్యక్తంచేస్తున్నారు. ఈ విషయంలో కేంద్రంపై ఒత్తిడి తెచ్చేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం పోరాటం చేస్తే.. వారికి మద్దతుగా ఉంటామని కార్మిక సంఘాలు బహిరంగంగా ప్రకటిస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం, ఆర్టీసీ యాజమాన్యం మాత్రం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నాయి.