బకాయి ఫీజులు చెల్లించాలని కలెక్టరేట్ల వద్ద ధర్నా
సంగారెడ్డి కలెక్టరేట్/కంఠేశ్వర్, జూన్ 23: రెండేండ్లుగా బకాయి ఫీజులు చెల్లించకపోవడంతో బెస్ట్ అవైలబుల్ స్కూల్ విద్యకు తమ పిల్లలు దూరం అవుతున్నారని విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం సంగారెడ్డి, నిజామాబాద్ కలెక్టరేట్ల వద్ద విద్యార్థులు, తల్లిదండ్రులు, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ సంఘాల నాయకులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్లకు వినతి పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2023-24, 2024-25 విద్యా సంవత్సరాలకు సంబంధించిన ఫీజులు బకాయి పడటంతో యాజమాన్యాలు తమ పిల్లలను పాఠశాలకు రావొద్దని చెప్తున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా రూ.200 కోట్లు బకాయి ఉన్నట్టు పేర్కొన్నారు. బకాయిలను చెల్లించి పేద, గిరిజన విద్యార్థుల చదువులకు ఆటంకం లేకుండా చూడాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఉపాధ్యాయులను నియమించాలని ఆందోళన
హన్వాడ, జూన్ 23 : ప్రభుత్వ పాఠశాలలో సరిపడా ఉపాధ్యాయులను నియమించాలని టంకరవాసులు మహబూబ్‌నగర్ కలెక్టరేట్ ఆవరణలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టంకర జడ్పీహెచ్ఎస్లో 230 మంది విద్యార్థులు విద్యాభ్యాసం చేస్త్తుండగా.. నలుగురు ఉపాధ్యాయులు మాత్రమే ఉన్నారని తెలిపారు. హిందీ, సోషల్, సైన్స్‌తో పాటు మరిన్ని సబ్జెక్టులకు ఉపాధ్యాయులు లేక విద్యార్థులు చదువులో వెనుకబడిపోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు. ఈ విషయమై ఇప్పటికే నాలుగు సార్లు కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినట్టు తెలిపారు. అనంతరం కలెక్టర్ విజయేందిరబోయికి వినతిపత్రం అందజేయగా.. స్పందించిన ఆమె పాఠశాలను తనిఖీ చేస్తానని హామీ ఇచ్చారు.
ఖమ్మం కలెక్టరేట్ ఎదుట పెన్షనర్ల ధర్నా
ఖమ్మం, జూన్ 23 : కేంద్రం తెచ్చిన పెన్షన్ సవరణ బిల్లును వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగుల సంఘం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ఖమ్మం కలెక్టరేట్ వద్ద సోమవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పెన్షనర్ల సంఘం రాష్ట్ర కార్యదర్శి పైడిపల్లి శరత్‌బాబు, టీజీవో రాష్ట్ర అధ్యక్షుడు, టీజీఈజేఏసీ చైర్మన్ ఏలూరి శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొస్తున్న పెన్షన్ సవరణ బిల్లు పెన్షనర్ల హక్కులకు భంగం కలిగించేలా ఉన్నదని అన్నారు.
సమస్యలు పరిష్కరించాలని ‘ఏజీయూ’లో ఆందోళన
వ్యవసాయ యూనివర్సిటీ, జూన్ 23: విద్యార్థుల స్కాలర్షిప్ పెంచడంతోపాటు, కళాశాలల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ వర్సిటీ, రాజేంద్రనగర్ వ్యవసాయ కళాశాల ఎదుట పీజీ, పీహెచ్డీ విద్యార్థులు పెద్దఎత్తున నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సోమవారం విద్యార్థులు అడ్మినిస్ట్రేషన్ భవనాన్ని ముట్టడించి.. రెండు గంటలపాటు రహదారిపై బైఠాయించారు.
రైతుభరోసా కోసం అన్నదాతల ధర్నా
ఇబ్రహీంపట్నం, జూన్ 23 : రైతు భరోసా కోసం రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మండలం ఎలిమినేడు గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట సోమవారం రైతులు, బీఆర్ఎస్ నాయకులు ధర్నాకు దిగారు. ఈ సందర్భంగా సీఎం దిష్టిబొమ్మను దహనం చేశారు. అనంతరం బీఆర్ఎస్ ఇబ్రహీంపట్నం మండల అధ్యక్షుడు చిలుకల బుగ్గరాములు, మాజీ ఎంపీపీ కృపేష్, సహకారసంఘం చైర్మన్ మహేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము కూడా రైతులమని, రైతు భరోసా ఎందుకివ్వరని ప్రశ్నించారు. ఎలిమినేడు శివారు ప్రాంతాల్లోని గ్రామాల రైతులకు వెంటనే రైతుభరోసా అందించాలని డిమాండ్ చేశారు. లేని పక్షంలో ఆందోళనను ఉద్ధృతం చేస్తామని హెచ్చరించారు.
సచివాలయం ఎదుట రైతుల ఆందోళన
హైదరాబాద్, 23 (నమస్తే తెలంగాణ): సచివాలయం వద్ద రైతులు ఆందోళనకు దిగడం సంచలనం సృష్టించింది. తమకు పట్టాదారు పాస్ పుస్తకాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ సోమవారం మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండలం నారాయణపురం రైతులు పెద్దఎత్తున సచివాలయం వద్దకు చేరుకొని, సౌత్ఈస్ట్ గేట్ ముందు ఆందోళన చేపట్టారు. అప్రమత్తమైన పోలీసులు వారిని అరెస్టు చేసి పోలీసుస్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ హయాంలో 700 ఎకరాలకు పట్టా ఇచ్చారని, ఇంకా 1,100 ఎకరాలకు పట్టా ఇవ్వాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరితే పట్టించుకోవడం లేదని రైతులు పేర్కొన్నారు. తాము ఎన్నో ఏండ్లుగా సాగు చేసుకుంటున్న భూములను అటవీ భూములుగా నమోదుచేయడంతో పాస్ పుస్తకాలు రాలేదని, దీంతో రైతుభరోసా, రైతుబీమా, రుణమాఫీ వంటి పథకాలు అందడంలేదని ఆవేదన వ్యక్తంచేశారు.
పంచాయతీలో పేరుకుపోయిన చెత్త
గత కేసీఆర్ ప్రభుత్వం పంచాయతీలకు ట్రాక్టర్లను అందిస్తే.. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం వాటికి డీజిల్ పోయలేని స్థితిలో ఉన్నది. డీజిల్ లేక 20 రోజులుగా చెత్త తీయడం లేదని మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం చిప్పల్తుర్తి గ్రామస్థులు తెలిపారు. సోమవారం మాజీమంత్రి హరీశ్, ఎమ్మెల్యే సునీతా లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్‌రెడ్డి తదితరులు గ్రామానికి వెళ్లగా.. పంచాయతీ కార్యాలయంలో ఇలా చెత్తతో లోడ్ చేసిన ట్రాక్టర్ నిలిపి ఉంచడం కనిపించింది. దీనిపై ఆరా తీస్తే.. అసలు విషయం బయటపడింది. అయితే హరీశ్‌రావు విమర్శల తర్వాత స్పందించిన ప్రభుత్వం.. డీజిల్ బిల్లులు విడుదల చేయడం కాకుండా తన తప్పిదానికి గ్రామ కార్యదర్శికి మెమో జారీ చేయడం గమనార్హం.