Telangana | హైదరాబాద్, డిసెంబర్ 28(నమస్తే తెలంగాణ): మాజీ సీఎం కేసీఆర్ వ్యవసాయం రంగంలో తీసుకొచ్చిన సంక్షేమ ఫలాలు దేశ ప్రజల ఆకలినే కాదు, విదేశీయుల ఆకలిని సైతం తీర్చుతున్నాయి. ఈ మేరకు తెలంగాణ బియ్యం ఫిలిప్పీన్స్‌కు ఎగుమతి కానున్నాయి. ఇందుకు సంబంధించి పౌరసరఫరాల సంస్థతో ఫిలిప్పీన్స్‌కు లక్ష టన్నుల బియ్యం సరఫరాకు ఒప్పందం కుదుర్చుకున్నది. శుక్రవారం మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డితో ఆ దేశ ప్రతినిధులు భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా లక్ష టన్నుల బియ్యం సరఫరాకు కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇందులో భాగంగా తొలి దశలో జనవరి నెలాఖరు నాటికి 40 వేల టన్నుల బియ్యం సరఫరా చేసేందుకు పౌరసరఫరాల సంస్థ చర్యలు చేపట్టింది. కొన్నేండ్లుగా రాష్ట్రంలో ధాన్యం ఉత్పత్తి భారీగా పెరిగింది. 2014లో 70 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి కాగా, ఇప్పుడు అది 2.5 కోట్ల టన్నులకు చేరింది. ఎఫ్‌సీఐకి సకాలంలో సీఎమ్మాఆర్ ఇవ్వలేని పరిస్థితి నెలకొన్నది. దీంతో మిల్లుల్లో టన్నుల కొద్ది ధాన్యం పేరుకుపోతున్నది. ఈ పరిస్థితుల్లో ఎఫ్‌సీఐకి ఇవ్వగా మిగిలిన బియ్యాన్ని ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు సివిల్ సప్లయ్ కొద్దిరోజులుగా కసరత్తు చేస్తున్నది. ప్రభుత్వం ఇప్పటికే 38 లక్షల టన్నుల ధాన్యాన్ని వేలం ద్వారా విక్రయించగా, మిగిలిన ధాన్యాన్ని విదేశాలకు సరఫరా చేసి ఆదాయాన్ని సమకూర్చుకోవాలని భావిస్తున్నది.