హైదరాబాద్, నవంబర్ 29 (నమస్తే తెలంగాణ): దేశం మొత్తానికి తెలంగాణ ఆహార భద్రత కల్పిస్తుందని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్‌రావు గతంలో చెప్పిన మాటలు అక్షర సత్యాలయ్యాయి. దేశమంతా సాగు విస్తీర్ణం, దిగుబడి తగ్గిపోతున్న తరుణంలో.. తెలంగాణలో స్థిరంగా పెరుగుతూ ఇప్పుడు దేశానికి ఆకలి తీర్చే పెద్ద దిక్కుగా మారింది. అన్నపూర్ణగా అవతరించింది. ఒక్క గింజ కూడా కొనేది లేదని ఏడాది కింద విర్రవీగిన కేంద్ర ప్రభుత్వమే ఇప్పుడు బియ్యం ఇవ్వండి ప్లీజ్ అంటూ తెలంగాణను అడుక్కొనే పరిస్థితి వచ్చింది. తాజాగా తమకూ బియ్యం కావాలంటూ తమిళనాడు, కర్ణాటక రాష్ర్టాలు నేరుగా తెలంగాణకు లేఖలు రాయటం మన రాష్ట్రంలో వ్యవసాయం ఎంతగా అభివృద్ధి చెందిందో నిరూపిస్తున్నది. తమకు బాయిల్డ్ రైస్ (ఉప్పుడు బియ్యం) ఇవ్వాలని కర్ణాటక, తమిళనాడు రాష్ర్టాలు తెలంగాణను కోరాయి. ఈ మేరకు ఆ రాష్ర్టాల పౌరసరఫరాల శాఖలు తెలంగాణ సివిల్ సప్లయికి ఇటీవల లేఖలు రాశాయి. తమకు బాయిల్డ్ రైస్ అవసరం భారీగా ఉన్నదని లేఖల్లో పేర్కొన్నాయి. తమిళనాడు 6 లక్షల టన్నులు, కర్ణాటక 2 లక్షల టన్నులు బియ్యం కావాలని కోరాయి.
ఈ నేపథ్యం లో బియ్యం విక్రయానికి ఇరు రాష్ర్టాల అధికారుల మధ్య చర్చలు కొనసాగుతున్నాయి. తమిళనాడు, కర్ణాటకలో ఉప్పుడు బియ్యం వినియోగం భారీగా ఉంటుంది. ఈ మేరకు ఉత్పత్తి లేకపోవడంతో ఆ రాష్ర్టాల్లో కొరత ఏర్పడుతున్నది. ఉప్పుడు బియ్యం ఉత్పత్తిలో ప్రస్తుతం దేశంలోనే తెలంగాణ టాప్ లో ఉన్నది. గత యాసంగిలో 52 లక్షల టన్నులు, అంతకు ముందు యాసంగిలో ఏకంగా 92 లక్షల టన్నుల ధాన్యం దిగుబడి వచ్చింది. ఇక్కడ యాసంగిలో వచ్చే ధాన్యం మొత్తం ఉప్పుడు బియ్యంగా మార్చవచ్చు.
తెలంగాణకు ఇతర రాష్ర్టాల వ్యాపారులు
బియ్యం, ధాన్యం కోసం ఇతర రాష్ర్టాల వ్యాపారులు తెలంగాణ వైపే చూస్తున్నారు. ఇతర రాష్ర్టాల్లో ధాన్యం కొరత ఏర్పడటం, నాలుగేండ్లుగా ఇక్కడ భారీగా ధాన్యం దిగుబడి వస్తుండటమే ఇందుకు కారణం. ఇప్పటికే రాష్ట్రంలో వానకాలం సీజన్ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు ఇతర రాష్ర్టాల మిల్లర్లు, వ్యాపారులు పోటీ పడుతున్నారు. కర్ణాటక, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర నుంచి ఇక్కడికి వస్తున్నారు. ఈ ఒక్క సీజన్లోనే 10 లక్షల టన్నులు కొనుగోలు చేసినట్టు సమాచారం. తెలంగాణలోని మి ల్లర్లు, వ్యాపారులు మరో 20 లక్షల టన్ను లు కొనుగోలు చేసినట్టు అంచనా.
ఒక్క సీజన్లో కోటిన్నర టన్నులు..
ఈ వానకాలం సీజన్లో తెలంగాణలో రికార్డు స్థాయిలో 65 లక్షల ఎకరాల్లో వరి సాగైంది. దీంతో 1.42 కోట్ల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందుకు తగ్గట్టుగానే ఇప్పటికే ప్రైవేటు వ్యాపారులు 30 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేయగా, ప్రభుత్వం 35 లక్షల టన్నుల ధాన్యం కొనుగోలు చేసింది. మరో 30 లక్షల టన్నుల వరకు కొనుగోలు చేసే అవకాశం ఉన్నది.
ఇదంతా కేసీఆర్ ఘనతే
ఒకప్పుడు కరువుతో తల్లడిల్లిన తెలంగాణ, ఇప్పుడు ఇతర రాష్ర్టాలకు బియ్యం అమ్మే స్థాయికి ఎదిగిందంటే ఇదంతా సీఎం కేసీఆర్ ఘనతే. ఆయన ముందుచూపు, రైతును రాజును చేయాలనే సంకల్పమే తెలంగాణ వ్యవసాయాన్ని దేశంలో మేటిగా నిలిపింది.
– గంగుల కమలాకర్, పౌరసరఫరాల శాఖ మంత్రి