హైదరాబాద్, డిసెంబర్ 3 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ఘనమైన చరిత్రను, అస్తిత్వాన్ని మరోసారి కొత్త కోణంలో ఆవిష్కరించేందుకు.. కొత్త తెలంగాణ చరిత్ర బృందం, తెలంగాణ భాషా, సాంస్కృతికశాఖ సౌజన్యంతో ‘తెలంగాణ పునర్దర్శనం’ పేరుతో సదస్సు నిర్వహణకు సిద్ధమైంది. జనవరి 10న రవీంద్రభారతిలో సదస్సు నిర్వహించనున్నట్టు కొత్త తెలంగాణ చరిత్ర బృందం కన్వీనర్ శ్రీరామోజు హరగోపాల్ తెలిపారు. ఈ నెల 25 వరకు దరఖాస్తులు స్వీకరిస్తామని చెప్పారు. ఈ మేరకు ఆయన బుధవారం బ్రోచర్ విడుదల చేశారు. తెలంగాణ అంటే కేవలం భౌగోళిక ప్రదేశం మాత్రమే కాదని, చరిత్రకు సాక్ష్యమని తెలిపారు. ఆదిమానవుడు సంచరించిన రాతి యుగాల నుంచి కాకతీయుల అద్భుతమైన వాస్తుశిల్ప సంపద వరకు, శాతవాహనుల నాణేల నుంచి ఆధునిక సాహిత్య చరిత్ర వరకు అనేక విషయాలు వెలుగుచూశాయని చెప్పారు.
ఇంకెన్నో అంశాలు వెలుగు చూడాల్సి ఉన్నదని తెలిపారు. చరిత్రకు మౌళిక సాక్ష్యాలైన శాసనాలు, నాణేల అధ్యయనం ద్వారా నాటి సామాజిక, ఆర్థిక పరిస్థితులను అంచనా వేయనున్నట్టు వివరించారు. తెలంగాణ సాహిత్యంలో ప్రతిబింబించిన చరిత్రను, ఆలయాలు, కట్టడాలలోని శిల్ప సౌందర్యాన్ని వెలికి తీయడం వంటి పలు అంశాలు సదస్సులో చర్చకు వస్తాయని వెల్లడించారు. వివిధ అంశాలపై చరిత్రకారులు, పరిశోధకులు, విద్యార్థులు, ఔత్సాహికులు పరిశోధనా పత్రాలు పంపించాలని కోరారు. వివరాల కోసం 9949498698 నంబర్‌కు కాల్ చేయాలని సూచించారు.