హైదరాబాద్, జూన్ 19 (నమస్తే తెలంగాణ): ఆంధ్రప్రదేశ్ ప్రభు త్వం తలపెట్టిన బనకచర్ల ప్రాజెక్టును నిర్మిస్తే.. ఆ ప్రాజెక్టుతో తరలించి నీటికి సమానంగా తెలంగాణకు కృష్ణా నదిలో నీళ్లను కేటాయించాలని తెలంగాణ రిటైర్డ్ ఇంజినీర్ల అసోసియేషన్ (టీఆర్ఈఏ) డిమాండ్ చేసింది. గురువారం అసోసియేషన్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేరెడ్డి శ్యామ్‌ప్రసాద్‌రెడ్డి, తన్నీరు వెంకటేశం ఈ మేరకు ఒక ప్రకటన విడుదలచేశారు. ‘గోదావరి నుంచి బనకచర్లకు 200 టీఎంసీలను పెన్నా బేసిన్‌కు తరలించాలని ప్రతిపాదిస్తున్నారు. అయితే, అందుకు బదులుగా 200 టీఎంసీలను తెలంగాణకు కృష్ణాలో అదనంగా కేటాయించాలి.
గోదావరి, దాని ఉపనదులపై తెలంగాణ చేపట్టిన, పూర్తయిన, కొనసాగుతున్న, భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు కేంద్రం నికర జలాలను కేటాయించాలి’ అని డిమాండ్ చేశారు. అన్ని అనుమతులు వచ్చిన తర్వాతే ఏపీ జీబీ లింక్ ప్రాజెక్టును చేపట్టాలని డిమాండ్ చేశారు. తొలుత గోదావరి బోర్డు డీపీఆర్‌ను పరిశీలించాలని, దానిని సీడబ్ల్యూసీకి పంపిన తరువాత అకడినుంచి హైడ్రలాజికల్ అనుమతులు రావా ల్సి ఉంటుందని పేర్కొన్నారు.
ఆ అనుమతులు వచ్చాక అపెక్స్ కౌన్సిల్లో చర్చించి ఆమోదం పొందిన తరువాతే ప్రాజెక్టును చేపట్టాలని సూచించారు. అయితే, ఈ ప్రాజెక్టును కేంద్రమే చేపట్టి త్వరగా పూర్తి చేస్తే రెండు రాష్ట్రాలకూ ఆర్థిక భారం తప్పుతుందని పేర్కొన్నారు.