హైదరాబాద్, డిసెంబర్ 24 (నమస్తే తెలంగాణ): గురుకుల ఉద్యోగం కోసం పరీక్ష రాసిన అభ్యర్థుల పరిస్థితి దయనీయంగా మారింది. 22 నెలల క్రితం ఈ పరీక్ష నిర్వహించిన తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు (ట్రిబ్) ఇప్పటికీ జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ (జీఆర్ఎల్)ను ప్రకటించకపోవడంపై అభ్యర్థులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వారు ఎక్కడ ఎలాంటి పొరపాట్లు చేశారో, ఏ కారణంగా ఉద్యోగం తెలియక మదనపడుతున్నారు. పోస్టులను భర్తీచేస్తే ప్రతి విషయంలో గోపత్య పాటించడం వెనుక ఆంతర్యమేంటని నిలదీస్తున్నారు.
సాధారణంగా పోటీపరీక్షల్లో రాతపరీక్షకు సంబంధించి తొలుత 1ః2 నిష్పత్తిలో అభ్యర్థులను సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌కు ఆహ్వానించి, అనంతరం ఎంపికైన అభ్యర్థుల జాబితాను 1ః1 నిష్పత్తిలో ప్రకటిస్తారు. ఆ సందర్భంగా పోస్టుకు ఎంపికైన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, రాతపరీక్షలో సాధించిన జనరల్ ర్యాంకు, అభ్యర్థి సాధించిన మార్కులను ప్రకటిస్తారు. నియామక పత్రాలను అందించిన అనంతరం మొత్తంగా ఆయా పోస్టులకు ఎంపికైన అభ్యర్థి హాల్‌టికెట్ నంబర్, రాతపరీక్షలో వచ్చిన మార్కులు, ఓవరాల్‌గా సాధించిన జనరల్ ర్యాంకు, ఏ రిజర్వేషన్ క్యాటగిరీలో పోస్టుకు ఎంపికయ్యారు? తదితర వివరాలన్నింటి జాబితాను ట్రిబ్ వెబ్సైట్లో పొందుపరుస్తారు.
దీంతో ఇతర అభ్యర్థులు ఎందుకు ఉద్యోగానికి ఎంపిక కాలేదో తెలుస్తుంది. గతంలో అన్ని రిక్రూట్మెంట్లకు సంబంధించిన ఫలితాలతోపాటు అభ్యర్థుల జీఆర్ఎల్ జాబితాను సైతం వెంటనే ప్రకటించారు. అన్ని రిక్రూట్మెంట్ బోర్డులు కూడా తుది ఫలితాలతోపాటు అభ్యర్థుల జీఆర్‌ఎల్‌ను సైతం వెంటనే ప్రకటిస్తున్నాయి. 2018, 2019లో ట్రిబ్ సైతం ఈ విధానాన్నే పాటించింది. కానీ, రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్రిబ్ భిన్నంగా ముందుకు సాగుతున్నది. గురుకుల నియామకాలకు సంబంధించిన జీఆర్‌ఎల్‌ను 22 నెలలుగా ప్రకటించడం లేదు. గురుకుల అభ్యర్థుల వ్యక్తిగత ఐడీలోనూ మార్కులను వెల్లడించలేదు.
సాధారణంగా రాతపరీక్షలో అభ్యర్థికి ఎన్ని నెగిటివ్ మార్కులు వచ్చాయి? ఎన్ని ప్రశ్నలకు సరైన సమాధానం ఇచ్చారు? మొత్తంగా వచ్చిన మార్కులు ఎన్ని? ఆ అభ్యర్థి ఏ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి, సాధించిన ర్యాంకు ఎంత అనే వివరాలను ట్రిబ్ గతంలో ప్రతి అభ్యర్థి వ్యక్తిగత ఐడీలో పొందుపరిచింది. కానీ ఇప్పుడు మాత్రం వాటికి ట్రిబ్ తిలోదకాలిచ్చింది. ప్రస్తుతం భర్తీచేసిన పీజీటీ, పీడీ, లైబ్రేరియన్ పోస్టులకు మినహా మిగతా టీజీటీ, జేఎల్, డీఎల్ పోస్టులకు సంబంధించిన వివరాలను నేటికీ పూర్తిస్థాయిలో అభ్యర్థులకు వెల్లడించలేదు. కనీసం వారి వ్యక్తిగత ఐడీల్లోనూ పొందుపరచకుండా పూర్తిగా గోప్యతను పాటిస్తున్నది. అందులో ఆంతర్యమేంటో తెలియక అభ్యర్థులు అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీ గురుకులాల్లోని 9 క్యాటగిరీల్లో మొత్తం 9,210 పోస్టుల భర్తీ కోసం గతంలో బీఆర్ఎస్ సర్కారు హయాంలోనే నోటిఫికేషన్ జారీచేసి, రాత పరీక్ష నిర్వహించారు. అనంతరం ఎన్నికలు రావడంతో అభ్యర్థుల ఎంపిక ప్రక్రియ వాయిదా పడింది. ఆ తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక ట్రిబ్ 8,708 పోస్టులకు ఫలితాలను ప్రకటించింది. వాటిలో 8,304 పోస్టులను భర్తీచేసింది. పార్లమెంట్ ఎన్నికల నోటిఫికేషన్‌కు ముందు ఎంపికైన ఆ అభ్యర్థులను వివిధ సొసైటీలకు కేటాయిస్తూ ఫిబ్రవరి, మార్చిలో పత్రాలను అందజేసింది.
కానీ, అప్పటికీ జీఆర్‌ఎల్‌ను ప్రకటించకపోవడంతో అనేక మంది అభ్యర్థులు ట్రిబ్‌ను నిలదీశారు. దీంతో ఫలితాలు వెల్లడించి, నియామక పత్రాలు అందించాక 90 రోజుల గడువులోగా ఎప్పుడైనా జీఆర్‌ఎల్‌ను ప్రకటించే అవకాశం ఉంటుందని నాడు ట్రిబ్ దబాయించింది. కానీ, 22 నెలలు గడిచినా ఇప్పటికీ జీఆర్‌ఎల్‌ను ప్రకటించలేదు. దీంతో ఉద్యోగానికి ఎందుకు ఎంపిక కాలేదో తెలుసుకునేందుకు అనేక మంది అభ్యర్థులు సమాచార హక్కు చట్టాన్ని ఆశ్రయించారు. ఆయా పోస్టులకు సంబంధించిన కటాఫ్ మార్కులు? రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఎలా పాటించారు? సర్టిఫికెట్ల వెరిఫికేషన్‌లో ఏ అంశాలను పరిగణనలోకి తీసుకున్నారు? అంశాలకు సంబంధించిన సమాచారం ఇవ్వాలని కోరుతున్నారు. గురుకుల పోస్టుల భర్తీకి ఎంపికైన అభ్యర్థుల జాబితాను ప్రకటించడం మొదలుకొని వెరిఫికేషన్, డెమోల నిర్వహణ వరకు ఏ అంశంలోనూ ట్రిబ్ పారదర్శకత పాటించలేదని అభ్యర్థులు ఆది నుంచే అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు.