
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ): తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలాల పంపిణీ, ప్రాజెక్టులు, కాలువల నిర్వహణ, పర్యవేక్షణలో వివాదాలు తలెత్తవద్దనే ఉద్దేశంతో ఏపీ పునర్విభజన చట్టం ప్రకారం ఏర్పాటైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు ఒంటెత్తు పోకడలు పోతున్నది. ఆదినుంచీ ఏకపక్షంగా.. ఏపీ పక్షంగా వ్యవహరిస్తున్నది. గోదావరి నదీ యాజమాన్యబోర్డు (జీఆర్ఎంబీ) సైతం కేఆర్ఎంబీ దారిలో నడుస్తున్నది. ఈ బోర్డులకు చైర్మన్లను జల్‌శక్తిశాఖ నియమించనుండగా.. తెలంగాణ, ఏపీ రాష్ర్టాలు మెంబర్లుగా ఉంటాయి. గతంలో ట్రిబ్యునళ్ల అవార్డులు లేదా రెండు రాష్ర్టాల ఒప్పందాలను, అపెక్స్ కౌన్సిల్ నిర్ణయాలను మాత్రమే బోర్డులు అమలుచేయాలి. ఇరురాష్ర్టాలను సంప్రదించాకే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. కానీ, కేఆర్ఎంబీ ఆదినుంచీ అందుకు భిన్నంగా వ్యవహరిస్తున్నదన్న విమర్శలున్నాయి. రివర్ బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ గతనెల 15న కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ వెలువడిన నాటినుంచి కేఆర్ఎంబీ మరింత ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నది. రెండు రాష్ర్టాలపై ముఖ్యంగా తెలంగాణపై ఆధిపత్యాన్ని చెలాయించేందుకు యత్నిస్తున్నది.
పోలవరం ప్రాజెక్టుకు కేంద్ర జల్‌శక్తి మంత్రిత్వశాఖ ఆమోదం నేపథ్యంలో బచావత్ ట్రిబ్యునల్ కేటాయించిన ప్రకారం తెలంగాణ ప్రాంతానికి కృష్ణా జలాల్లో అదనంగా దక్కాల్సిన 45 టీఎంసీలు, తాగునీటి కోసం కేటాయించిన మొత్తం జలాల్లో 20% మాత్రమే పరిగణలోకి తీసుకోవాలనే అంశంపై రాష్ట్ర ఆవిర్భావం నుంచీ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి, కృష్ణా బోర్డుకు లేఖలు రాస్తూనే ఉన్నది. పునర్విభజన చట్టాన్ని అతిక్రమించి ఏపీ సర్కారు సీమ ఎత్తిపోతల పథకం, రాజోలిబండ డైవర్షన్ స్కీమ్ తదితర పనులను చేపడుతున్నదని, వాటిని అడ్డుకోవాలని ఫిర్యాదులు చేసింది. వీటిపై కేఆర్ఎంబీ ఏపీకి లేఖలు రాసి చేతులు దులుపుకొన్నది. అదేసమయంలో ఏపీ ఏ అభ్యంతరం లేవనెత్తినా సత్వరమే స్పందిస్తున్నది. తెలంగాణ ప్రభుత్వం శ్రీశైలంలో విద్యుత్తు ఉత్పత్తిపై ఏపీ లేఖ రాయగానే ఆగమేఘాలపై స్పందించి.. ఉత్పత్తిని నిలిపివేయాలంటూ హుకుం జారీచేసింది. ఇక కేంద్రం గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేశాక కేఆర్ఎంబీ తీరు మరింత ఇష్టారాజ్యంగా మారిందనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. ఇరు రాష్ర్టాలను సంప్రదించకుండానే బోర్డు సమావేశాల తేదీలను ఖరారు చేస్తున్నది. తెలంగాణను సంప్రదించకుండానే ఆగస్టు 9న బోర్డ్ మీటింగ్ నిర్వహించనున్నట్టు జీఆర్ఎంబీ తెలుపగా.. కేఆర్ఎంబీ సైతం అదేరోజున జీఆర్ఎంబీతో కలిసి ఉమ్మడిగా బోర్డు మీటింగ్ నిర్వహిస్తామని రాష్ర్టాలకు సమాచారమిచ్చింది.
కోర్టు ఉత్తర్వుల అమలులోనూ కేఆర్ఎంబీ తాత్సారం చేస్తున్నది. ఏపీ ప్రభుత్వం నిర్మిస్తున్న సీమ ఎత్తిపోతల పథకాన్ని క్షేత్రస్థాయిలో సందర్శించి నివేదిక అందించాలని ఎన్జీటీ చెన్నై బెంచ్ గత అక్టోబర్‌లో కేఆర్ఎంబీని ఆదేశించింది. దీనిపై పదినెలలుగా తాత్సారం చేస్తూ పరోక్షంగా ఏపీకి అండగా నిలుస్తున్నది. ఏపీతో సంబంధం లేకుండా ప్రాజెక్టును సందర్శించి ఆగస్ట్ 9లోగా నివేదికను అందజేయాలని ఎన్జీటీ మరోసారి స్పష్టమైన ఆదేశాలు జారీచేసింది. రెండు రోజులే గడువు ఉన్నా కేఆర్ఎంబీ రాయలసీమ ప్రాజెక్టును సందర్శించలేదు. అదీగాక అదేరోజున బోర్డ్ మీటింగ్ నిర్వహిస్తామని రాష్ర్టాలకు లేఖలు రాయడం కేఆర్ఎంబీ ఏకపక్ష వైఖరికి నిదర్శనమని పలువురు నీటిపారుదల నిపుణులు అంటున్నారు. నిన్న మొన్నటివరకు ఉలుకూ పలుకూ లేకుండాఉన్న జీఆర్ఎంబీ సైతం గెజిట్ విడుదల అనంతరం కేఆర్ఎంబీ దారిలోనే పెత్తనం చలాయించేందుకు యత్నిస్తుండడం గమనార్హం. కేఆర్ఎంబీ, జీఆర్ఎంబీల వ్యవహార శైలిపై సాగునీటి రంగ నిపుణులు, ఇరు రాష్ర్టాల ఇంజినీర్లు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు.