హైదరాబాద్, సెప్టెంబర్ 11 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. శుక్రవారం రాష్ట్రవ్యాప్తంగా 220 కరోనా కేసులు నమోదయ్యాయి. 27 జిల్లాల్లో 10లోపే కరోనా కేసులు నమోదుకాగా, అత్యధికంగా జీహెచ్ఎంసీలో 71, కరీంనగర్ 11, ఖమ్మం 12, నల్లగొండ 17, రంగారెడ్డి 12, వరంగల్ అర్బన్‌లో 11 కేసులు నమోదయ్యాయి. 6 జిల్లాల్లో ఒక్క కేసు కూడా నమోదు కాలేదు. కరోనా వల్ల ఒకరు ప్రాణం కోల్పోయారు. జాతీయ రికవరీ రేటు 97.46 శాతం ఉండగా, రాష్ట్రంలో 98.60 శాతానికి చేరుకున్నది. ప్రస్తుతం రాష్ట్రంలో 5351 మంది కరోనా చికిత్స పొందుతున్నట్టు వైద్యారోగ్యశాఖ శనివారం విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొన్నది.
చిన్నారుల్లో పెరిగిన దాఖలాల్లేవు
కరోనా చిన్నారులను లక్ష్యంగా చేసుకుంటుందని పలు అధ్యయనాలు వెల్లడించిన నేపథ్యంలో ప్రభుత్వం ఆ మేరకు అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నది. ఇప్పటిరకు చిన్నారుల్లో కేసులు పెరిగిన దాఖలాలు లేవని వైద్యాధికారులు స్పష్టం చేస్తున్నారు. ఇప్పటివరకు నమోదైన కేసుల్లో పదేండ్ల వయసున్న చిన్నారులు కేవలం 2.9 శాతం మాత్రమే ఉన్నారు. కరోనా కేసుల్లో అత్యధికంగా 21 నుంచి 40 ఏండ్ల వయసు వారు దాదాపు 43 శాతం దాకా ఉన్నారు.