హైదరాబాద్, ఏప్రిల్ 28 (నమస్తే తెలంగాణ): తెలంగాణ ప్రభుత్వం పెట్రో ధరలపై వ్యాట్ తగ్గించడం లేదంటూ ప్రధాని మోదీ చేసిన వ్యాఖ్యలను సమర్థించిన కేంద్ర మంత్రి కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాలశాఖ మంత్రి హర్దీప్సింగ్ పురిపై మంత్రి కేటీఆర్ భగ్గుమన్నారు. పెట్రో ధరలను పెంచింది ఎవరో ప్రజలకు తెలుసని పేర్కొన్నారు. కేంద్రం ఖాతాకు మాత్రమే జమయ్యేలా పెట్రోల్‌పై సెస్సులు విధిస్తూ దోచుకుంటున్నదని విమర్శించారు. ‘పెట్రోల్, డీజిల్‌పై తెలంగాణ అత్యధిక వ్యాట్ విధిస్తున్నది. పెట్రోల్‌పై 35.20 శాతం, డీజిల్‌పై 27 శాతంతో 2014 నుంచి 2021 వరకు రూ.56,020 కోట్లు వ్యాట్ రూపంలో వసూలుచేసింది. 2021-22లో రూ.13,315 కోట్లు వసూలు చేస్తుంది’అని హర్దీప్సింగ్పురి ట్వీట్‌చేశారు. దీనిపై ఐటీశాఖ మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు.
తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు వ్యాట్‌ను ఒక్కసారి కూడా పెంచలేదని, అలాంటప్పుడు ధరల పెరుగుదల ఎక్కడి నుంచి వచ్చిందో చెప్పాలంటూ నిలదీశారు. ‘పురి జీ.. మీరు కుందేళ్లతో పరుగెత్తలేరు. అలాగని వేటకుక్కల్లా వేటాడలేరు. బ్యారెల్ క్రూడాయిల్ ధర 2014 ఏప్రిల్‌లో, 2022 ఏప్రిల్‌లో దాదాపు 105 డాలర్లుగా ఉన్నది. కానీ 2014లో పెట్రోల్ ధర రూ.70 ఉంటే, ఇప్పుడు రూ.120. తెలంగాణలో ఇప్పటి వరకు వ్యాట్ పెంచలేదు. అయినా ఈ పెరుగుదల ఎక్కుడి నుంచి వచ్చింది? ఎన్పీఏ ప్రభుత్వం విధించిన అదనపు ఎక్సైజ్ సుంకాలు, సెస్‌ల కారణంగా ధరలు పెరిగింది వాస్తవం కాదా? సెస్‌ను రద్దు చేస్తే భారతదేశం మొత్తం పెట్రోల్‌ను రూ.70, డీజిల్‌ను రూ.60కి ఇవ్వవచ్చని ప్రధాని మోదీకి మీరు ఎందుకు సలహా ఇవ్వడం లేదు? ఎన్పీఏ ప్రభుత్వం ఇప్పటివరకు రూ.26.5 లక్షల కోట్లు సెస్‌గా వసూలు చేసింది నిజం కాదా?’ అని ట్వీట్లో కేటీఆర్ నిలదీశారు.