Y Satish Reddy | హైదరాబాద్ : పీడిత ప్రజల కోసం, తెలంగాణ సాధన కోసం పోరాడిన వీరుడు గద్దర్.. ఆయన మరణాన్ని రాజకీయాలకు వాడుకుంటున్న నీచుడు రేవంత్ రెడ్డి అని తెలంగాణ రెడ్కో చైర్మన్ వై సతీష్ రెడ్డి తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. ఓట్ల కోసం రేవంత్ రెడ్డి ఎంతకైనా తెగిస్తాడు.. వీరుల మరణాన్ని కూడా వాడుకుంటాడని మరోసారి స్పష్టమైందని మండిపడ్డారు. శవాల మీద పేలాలు ఏరుకున్నట్టు దిగజారి నీచ రాజకీయాలు చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.
వాస్తవానికి గద్దర్ వెన్నులో ఇప్పటికీ ఉన్న బుల్లెట్‌ను దించింది రేవంత్ రెడ్డి గురువైన చంద్రబాబు నాయుడు అని సతీష్ రెడ్డి తెలిపారు. తెలంగాణ ఏర్పడే వరకు అదే చంద్రబాబు వెంట తిరిగిన రేవంత్ రెడ్డికి గద్దర్ గురించి తెలియలేదా? ఆ తర్వాత చర్చల పేరుతో గద్దర్ సహచరులనూ ఎన్కౌంటర్ చేసి చంపింది ఇప్పుడు రేవంత్ రెడ్డి అధ్యక్షుడిగా ఉన్న కాంగ్రెస్ పార్టీ కాదా? అని ప్రశ్నించారు. గద్దర్‌కు అన్యాయం, మోసం చేసిన పార్టీలు రెండింటితో అంటగాగుతున్న రేవంత్ రెడ్డి… ఇప్పటికీ తాను చంద్రబాబునాయుడు సహచరుడినని చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డికి కనీసం గద్దర్ భౌతికకాయం తాకే అర్హత కూడా లేదన్నారు.
గద్దర్‌కు ఏ పార్టీతో సంబంధం లేదు.. ఆయన ప్రజా గాయకుడు, ప్రజా నాయకుడు, ప్రజల మనిషి అని సతీష్ రెడ్డి స్పష్టం చేశారు. గద్దర్‌కు మానని గాయం చేసిన పార్టీలతో తిరుగుతూ ఇప్పుడు ఆయన చనిపోగానే మొసలి కన్నీరు కారుస్తున్న మేక వన్నె పులి రేవంత్ రెడ్డి అని ధ్వజమెత్తారు. తెలంగాణ సాధన కోసం గద్దర్ గజ్జె కట్టి ఆడిన నాడు ఇదే రేవంత్ రెడ్డి చంద్రబాబు కాళ్ళ దగ్గర కూర్చున్నాడు. చంద్రబాబుతో తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇప్పించానని ఇప్పుడొచ్చి గప్పాలు కొట్టడం సరికాదన్నారు. రాష్ట్రం విడిపోవడంతో తనకు మరో మార్గం లేక తన రాజకీయ భవిష్యత్తు కోసం కాంగ్రెస్ పార్టీలో చేరి ఉద్యమకారులపైనే విమర్శలు చేయడం సరికాదన్నారు.
సన్నాసి రేవంత్ రెడ్డి తెలుసుకోవాల్సింది ఏందంటే కేసీఆర్ ఆంధ్ర నాయకుల కుట్రలను పసిగట్టారు కాబట్టే తన పదవులకు రాజీనామా చేసి తెలంగాణ సాధన ఉద్యమాన్ని నెత్తికెత్తుకుని ప్రాణాల సైతం పణంగా పెట్టారని సతీష్ రెడ్డి తెలిపారు. కానీ నువ్వు చేసింది ఏంటి? ఆంధ్ర బాబు కాళ్ళ కాడ ఎంగిలి మెతుకుల కోసం ఆరాటపడ్డావు. ఉద్యమకారుల మీదికే తుపాకి పట్టుకుని ఉరికావు. ఇప్పుడొచ్చి కట్టుకథలు, పిట్టకథలు చెప్పినంత మాత్రానా తెలంగాణ సమాజం నమ్మదు. నీ అసలు రూపం ఏంటో ప్రజలకు, మరీ ముఖ్యంగా ఉద్యమకారులకు తెలుసు. నీ పార్టీకి అధికారం ఇస్తే రాష్ట్రాన్ని తిరిగి తీసుకెళ్లి ఆంధ్ర బాబు కాళ్ల దగ్గర, ఢిల్లీ పెద్దల దగ్గర పెడతావనే విషయం కూడా తెలంగాణ ప్రజలకు తెలుసు. కాబట్టి నీ డ్రామాలు మానుకుంటే మంచిదని రేవంత్ రెడ్డిని వై సతీష్ రెడ్డి హెచ్చరించారు.