హైదరాబాద్, అక్టోబర్17 (నమస్తే తెలంగాణ): ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్ అమలులో తెలంగాణ రాష్ట్రం ఉత్తమ ప్రతిభ కనబర్చి అవార్డు సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో శుక్రవారం జరిగిన ఆది కర్మయోగి జాతీయ సదస్సులో అవార్డులను రాష్ట్రపతి ముర్ము అందజేశారు. ప్రధాన మంత్రి జన్జాతి ఆదివాసీ న్యాయ మహా అభియాన్లో గిరిజన సమూహాలకు న్యాయం చేయడం, ప్రాంతాల అభివృద్ధిలో తెలంగాణ ఉత్తమ పనితీరు కనబరిచి జాతీయస్థాయిలో 3వ స్థానంలో నిలిచింది.
ప్రభుత్వ సెక్రటరీ గౌరవ్ ఉప్పల్ అవార్డును స్వీకరించారు. ఆది కర్మయోగి అభియాన్లో ఆదిలాబాద్, నల్లగొండ, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, దర్తీ ఆబా జనభాగిధరి అభియాన్లో ఆదిలాబాద్, కుమ్రంభీం జిల్లాలు ప్రతిభ చూపగా, ఆయా జిల్లా కలెక్టర్లు అవార్డులను అందుకున్నారు. తెలంగాణ గిరిజన సాంసృతిక పరిశోధన, శిక్షణ సంస్థ అసిస్టెంట్ డైరెక్టర్ పద్మ పీవీని సూపర్ కోచ్లు/రాష్ట్ర మాస్టర్ ట్రైనర్లో ఒకరిగా, ఉత్తమ ప్రదర్శనలో డాక్టర్ కీర్తిని సత్కరించారు. కార్యక్రమంలో ఐటీడీఏ ఏటూరునాగారం ప్రాజెక్ట్ ఆఫీసర్, టీఆర్ఐ డైరెక్టర్ డాక్టర్ సముజ్వల పాల్గొన్నారు.