హైదరాబాద్, మే 4 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పబ్లిక్ స్కూల్స్(టీపీఎస్) బస్సులను పెండ్లిళ్లకు వినియోగించడం వివాదాస్పదమైంది. ఇతర కార్యక్రమాలకు వినియోగించడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. ఆరుట్లలోని తెలంగాణ పబ్లిక్ స్కూల్కు చెందిన ఓ బస్సును.. డ్రైవర్ తన సోదరుడి వివా హం కోసం వినియోగించగా.. విషయం విద్యా కమిషన్కు తెలిసింది. బస్సులను ఇష్టారీతిన వాడటాన్ని సీరియస్గా తీసుకున్నది. విద్యార్థుల రవాణా, పర్యటనలకు మినహా ఇతరాల కోసం వాడరాద ని సూచించింది. వివాహాలు, విద్యయేతర కార్యకలాపాల కోసం అసలు వాడరాదని ఆదేశించింది.
ఇలా వాడటం దుర్వినియోగం కిందికే వస్తుందని, ఇలాంటివి పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని విద్యా శాఖ ఆదేశించింది. విద్యాశాఖ చైర్మన్ ఆకునూరి మురళి సోమవారం ఆరుట్ల, వంగూరు, మంచాల, పొల్కంపల్లి పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు లేఖలు రాశారు. విద్యాకమిషన్ లేఖలు రాయడం, ఆదేశాలివ్వడంపై ఉపాధ్యాయ సంఘాలు అభ్యంతరం వ్యక్తంచేస్తున్నాయి. కేవలం విద్యా సంస్కరణలను సిఫార్సు చేయాల్సిన కమిషన్, ఇలా ఆదేశాలివ్వడమేంటని ప్రశ్నిస్తున్నాయి. విద్యాశాఖ డైరెక్టర్ ఇవ్వాల్సిన ఉత్తర్వులను విద్యా కమిషన్ ఇవ్వడంపై గుర్రుగా ఉన్నాయి.