Degree Exams | హైదరాబాద్, మే 8 (నమస్తే తెలంగాణ): ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు చెల్లించకుంటే ఈనెల 14నుంచి నిర్వహించే డిగ్రీ పరీక్షలను బహిష్కరిస్తామని తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కాలేజీల మేనేజ్మెంట్ అసోసియేషన్ (టీపీడీఎంఏ) ప్రభుత్వానికి హెచ్చరికలు జారీచేసింది.
సకాలంలో ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించకపోవడంతో అనేక ప్రైవేటు కాలేజీలు అచేతనస్థితిలో ఉన్నాయని.. 50శాతానికిపైగా డిగ్రీ కాలేజీలు మూతపడ్డాయని ఆ సంఘం అధ్యక్షుడు సూర్యనారాయణరెడ్డి వాపోయారు. రెండు, మూడురోజుల్లో ప్రభుత్వం స్పందించి పెండింగ్ బకాయిలు జమ చేస్తేనే యూనివర్సిటీ షెడ్యూల్ ప్రకారం పరీక్షల నిర్వహణ ఉంటుందని తెలిపారు. లేకపోతే ఉద్యోగులు సహకరించక యాజమాన్యాలు చేతులెత్త్తేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు.