హైదరాబాద్, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ): జాతీయ స్థాయిలో జరిగిన ప్రిజన్ డ్యూటీ మీట్ 2022లో తెలంగాణ జైళ్లశాఖ అధికారులు సత్తా చాటారు. గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో ఆరో జాతీయ ప్రిజన్ డ్యూటీ మీట్-2022 ఈ నెల 4 నుంచి మూడురోజుల పాటు నిర్వహించిన ఈ డ్యూటీ మీట్లో మొత్తం 19 రాష్ర్టాల నుంచి 960 మంది క్రీడాకారులు పాల్గొన్నారు.
ఈ పోటీల్లో 68 మంది తెలంగాణ జైళ్లశాఖ ఉద్యోగులు ఆరు బంగారు, ఒక వెండి, రెండు రజత పతకాలతోపాటు నాలుగు ఆల్‌రౌండ్ ట్రోఫీలను గెలిచారు. వరంగల్ కేంద్ర కారాగార పర్యవేక్షణ అధికారి సంపత్ ఈ డ్యూటీ మీట్‌కు నేతృత్వంవహించారు. మంగళవారం జరిగిన డ్యూటీమీట్ ముగింపు కార్యక్రమానికి గుజరాత్ రాష్ట్ర గవర్నర్ ఆచార్య దేవదత్ ముఖ్యఅతిథిగా హాజరై, విజేతలకు బహుమతులు అందజేశారు. మొదటి స్థానంలో నిలిచినందుకు తెలంగాణ జైళ్లశాఖ డీజీ జితేందర్, జైళ్లశాఖ ఐజీ రాజేశ్ హర్షం వ్యక్తం చేశారు. డ్యూటీమీట్‌లో పాల్గొన్న సిబ్బందిని అభినందించారు.