నిర్మల్ చైన్‌గేట్, జూలై 12 : పిల్లల్లో నులిపురుగుల వ్యాప్తిని అరికట్టి, వారి ఆరోగ్యాన్ని కాపాడడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జాతీయ నులి పురుగుల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నాయి. ఈ సందర్భంగా ఈనెల 13వ తేదీ సోమవారం నుంచి పిల్లలందరికీ ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేసేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. కలెక్టర్ భవేశ్‌మిశ్రా, జిల్లా వైద్యాధికారి రాజేందర్ జిల్లాస్థాయి అధికారులతో సమీక్ష నిర్వహించారు.
మాత్రల పంపిణీపై వైద్య సిబ్బందికి శిక్షణ కల్పించారు. నిర్మల్ జిల్లాలో 1 నుంచి 19 ఏళ్లలోపు ఉన్న 1,91,943 మంది పిల్లలకు ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలు, కళాశాలల్లో నులిపురుగు నివారణ మాత్రలు మింగించేందుకు ఏర్పాట్లు చేశారు. ఈ నెల 13వ తేదీన మాత్రలు మింగని పిల్లలకు 20వ తేదీన మింగించేందుకు చర్యలు తీసుకున్నారు. రక్తహీనత, పోషకాలలోపం, ఆకలి లేకపోవుట, బలహీనత, ఆందోళన, కడుపునొప్పి, వికారం నీళ్ల విరోచనాలు, బరువు తగ్గడం వంటి లక్షణాలుంటాయి.
పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలి. పరిశుభ్రమైన ఆహారం, నీరు తీసుకోవాలి. ఆహార పదార్థాలపై మూతలు ఉంచాలి. ఆరుబయటకు వెళ్లినపుడు పాదరక్షలు ధరించాలి. భోజనం చేసే ముందు, మరుగుదొడ్డి ఉపయోగించిన తర్వాత చేతులను శుభ్రంగా కడుక్కోవాలి. బహిరంగ ప్రదేశాలలో మలవిసర్జన చేయవద్దు. తినేముందు పండ్లు, కాయగూరలు శుభ్రంగా కడుక్కోవాలి. నివారణకు ఆల్బెండజోల్ మాత్రలు మింగించాలి.
1 నుంచి రెండేళ్ల లోపు పిల్లలకు సగం మాత్రను పౌడర్‌గా చేసి మింగించాలి. 2 నుంచి మూడేళ్లలోపు చిన్నారులకు ఒక మాత్ర పొడి చేసి మింగించాలి. మూడు నుంచి 19 ఏళ్లలోపు ఉన్న వారికి మాత్ర ఒకటి మింగించాలి. ఈ విషయమై జిల్లా వైద్యాధికారి రాజేందర్‌ను అడుగగా.. నులిపురుగు నివారణ మాత్రల పంపిణీకి ప్రజలు సహకరించాలని కోరారు.
