జానకమ్మ ఎనభై ఎనిమిదేండ్ల జీవనయానంలో అరవై ఏండ్ల గాన జీవనయానం. యాభై వేల పాటలు. పాడిన పాటలను సంవత్సరాలతో భాగిస్తే రోజుకు కనీసం రెండు, మూడు పాటలు. జానకమ్మ రోజుకు ఐదారు పాటలు రికార్డింగ్ చేసిన సందర్భాలు కచ్చితంగా ఉండే ఉంటాయి. లేకపోతే ఒక జీవిత కాలంలో అన్ని పాటలు పాడడం సాధ్యం కాదు. ఇరవై భాషల్లో వేల పాటల వేవేల అందాలను విని ఆనందించాలే కానీ… మాటలతో చెప్తే అర్థమయ్యేది కాదు. గొంతులో పసిపిల్లల బోసి నవ్వులను, గానంలో అమృతాన్ని, రాగంలో తీయదనాన్ని నింపుకొన్న ఆమె మృతికి నివాళిగా రెండు, మూడు పాటలను నెమరువేసుకుందాం. ఒకటి- జానకమ్మ గొంతుముందు పోటీ పడలేక ఓడిపోయిన నాదస్వరం. రెండు- గోవుల్లు తెల్లన- గోపెమ్మ నల్లనయి… జానకమ్మ గొంతు చల్లిన గోధూళి ఎర్రని స్వరార్ణవ అరుణారుణ వర్ణాలు. మూడు- కులమే లేని గోకులంలో అనురాగకులం.
జానకమ్మ 1938 ఏప్రిల్ 23న ఆంధ్రప్రదేశ్లోని గుంటూరు జిల్లా రేపల్లెలో జన్మించినప్పటికీ ఆమె బాల్యం, సంగీత సాధన ఎక్కువగా తెలంగాణలోనే సాగాయి. ఆమె చిన్నతనంలోనే వారి కుటుంబం నాటి ఉమ్మడి కరీంనగర్ జిల్లా సిరిసిల్లకు తరలివచ్చింది. 1940ల చివరి నుంచి 1950ల మధ్య కాలం వరకు ఆమె సిరిసిల్లలోనే పెరిగారు. అక్కడే తన పదేండ్ల ప్రాయంలో (1948 ప్రాంతాల్లో) నాథుని సద్గురుస్వామి గురువు దగ్గర శాస్త్రీయ సంగీతంలోని ప్రాథమిక పాఠాలు నేర్చుకొన్నారు.
మనిషి గొంతుకు కొన్ని పరిమితులుంటాయి. కొన్ని అనుకూలతలుంటాయి. సంగీత వాయిద్య పరికరాలకు కొన్ని పరిమితులుంటాయి. కొన్ని అనుకూలతలుంటాయి. అలాగే ఎంత గొప్ప వాయిద్య పరికరమైనా మనిషిలా పాడలేదు. వీణ, వయోలిన్, నాదస్వరంలా మనిషి పాడలేడు. దేని గొప్ప దానిదే. దేని అందం దానిదే. కానీ జానకమ్మ 1962లో మొదట తమిళంలో, తర్వాత తెలుగులో పాడిన నీ లీల పాడెద దేవా! అనే పాట నాదస్వరంతో పోటీ పడ్డ అరుదైన పాట. గొప్ప ప్రయత్నం. ప్రయోగం. ప్రమోదం. ఆ మాటకొస్తే సకల భారతీయ పాటల్లో ఇప్పటిదాకా రికార్డయిన కొన్ని లక్షల సినిమా పాటల్లో ఇదొక మెరుపు. గిలిగింత. పులకింత. ఇందులో జానకమ్మ అచ్చు నాదస్వరంలాగే
పాడడంతో ఆ మేళం మొదట ఆశ్చర్యపోయింది.
తర్వాత పొంగిపోయింది. ఆపై జానకమ్మ గొంతులో ఒదిగిపోయింది. చివరకు తనను తాను మరచిపోయి జానకమ్మగా మారిపోయింది. ఇలాంటి ఆలోచన చేసిన ఆ సినిమా దర్శకుడికి, పాట రాసిన రచయితకు, పాటకు బాణీ కట్టిన సంగీత దర్శకుడికి, ప్రత్యేకించి తన ఊపిరినంతా ఊది ఆ నాదస్వరానికి ప్రాణం పోసిన నాదస్వర సంగీతజ్ఞుడికి లోకం ఎల్లకాలం రుణపడి ఉండాలి. (చిత్రం- మురిపించే మువ్వలు; సంగీతం- ఎస్. ఎం.సుబ్బయ్య నాయుడు;. గీతరచయిత- ఆరుద్ర; దర్శకుడు- ఎం.వి.రామన్). మాటల్లో చెప్పలేని మాధుర్యమది. చెవులున్నందుకు వినాలి- అంతే. బహుశా ఆమె గొంతులో ఉన్న ప్రత్యేకత ఆ సందర్భానికి అలా ప్రాకృతికంగా కుదిరిందని ఆమె పాదాలకు ఒక నమస్కారం పెట్టి… ఆ నాదస్వర లీలను ఒక లీలగా… లాలిగా… తరతరాలుగా వింటూ ఉండడం ఒక్కటే మనం ఆమెకు ఇవ్వదగ్గ నిజమైన నివాళి.
కళా తపస్వి విశ్వనాథ్ దృశ్యకావ్యం సప్తపది. వేటూరి రచన. కేవీ మహదేవన్ సంగీతం. బాలుతో కలిసి జానకమ్మ గానం. సందర్భం- కులాలు, వర్ణాలు అన్నీ మనం కల్పించుకొన్నవే. మనుషులంతా ఒక్కటే అనే పరమోన్నత సందేశం. ఇలాంటప్పుడు వేటూరి సందర్భాన్ని ఆకాశమంత ఎత్తుకు తీసుకెళ్లిపోతారు. ఏ వర్ణం? ఏ కులం? అంటుంటే గోకులం ఘొల్లుమని నవ్వి.. మాధవుడు, యాదవుడు మా కులమేలెమ్మని చెప్తుంటే… ఏ సప్తపదికి ఏ అడుగులు ఎలా పడాలో, ఆ పడే అడుగులకు ఏ పదాలు పాడాలో తెలిసినవాడు వేటూరి. ఆయన రాస్తే రాశారు కానీ… అందులో ఆవుల మంద వెంట ఉన్నది మూడు పాత్రలు. ఒక పెద్దాయన. ఒకబ్బాయి. ఒక చంటి పిల్లాడు. అబ్బాయికి, చంటి పిల్లాడికి జానకమ్మ పాడారు. గోపబాలుడు అమాయకంగా అడిగే సకలవర్ణ సందేహాలను సకల ప్రపంచం తరపున జానకమ్మ అమాయకంగా అడిగే తీరు.. న భూతో.. న భవిష్యతి. పాటలో పెద్దాయన గొంతు బాలుది. ఒక పాటలోనే జానకమ్మ రెండు గొంతుల వైవిధ్యం కర్ణామృతం. ఎందుకుండవ్? ఏమో? లాంటి పసి ప్రశ్నల ముద్దు ముద్దు మాటల జానకమ్మ… ఇలా ఎన్ని వేల పాటల్లో ముద్దులు మూటగట్టి ఇచ్చారో లెక్కగడితే అదో పెద్ద ముద్దు మాటల చర్చ.
ఆమె పెదవి పలికితే గేయాలు. మన గుండె గొంతుల్లో నిండే పాటలు. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిది. జానకమ్మ అను రాగం ఏనాటిదో… మన ఆనందం ఆనాటిది. అది మొన్నటిది. నిన్నటిది. ఈరోజుది. రేపటిది. వినేవారికి ఎప్పటిదీ. అది అనగల రాగమై తొలుత వీనులలరించి… అనలేని రాగమై మరలా వినిపించి… మరులే కురిపించే జీవన రాగం. బృందావన గీతం. జానకమ్మ గొంతు ఎప్పటికీ శైశవం దాటకుండా అలా ముద్దుముద్దుగా ఉండిపోయింది- ఎందువలన? అంటే… దైవ ఘటన.
– పమిడికాల్వ మధుసూదన్ 9989090018