భైంసా టౌన్, జూలై 12 : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలోని ఓటర్ల సర్వే ప్రక్రియను వేగవంతం చేయాలని నిర్మల్ కలెక్టర్ భవేశ్ మిశ్రా అధికారులను ఆదేశించారు. ఆదివారం ఆయన పట్టణంలోని ఎంపీడీవో కార్యాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. శనివారం సాయంత్రం నాటికి పట్టణంలో కేవలం 20 శాతం మాత్రమే సర్వే పూర్తి కావడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. సర్ ప్రక్రియను వేగవంతం చేసేందుక పట్టణంలోని 26 వార్డులను ఆరు జోన్లుగా విభజించి ప్రతి జోన్‌కు జిల్లా స్థాయి అధికారిని స్పెషన్ ఆఫీసర్‌గా నియమించి వారికి తోడుగా మండల స్థాయి అధికారులను కూడా నియమించి పర్యవేక్షించాలని భైంసా డివిజన్ సబ్ కలెక్టర్ సంకేత్‌కుమార్‌కు సూచించారు.
ఓటరు జాబితాలో పేర్లు లేని ఓటర్లు ఎన్యుమరేషన్ ఫారం కింది భాగంలో ఆధార్ కార్డు నంబరు, పుట్టిన తేదీ, మొబైన్ నంబరు, సంతకం చేసి బీఎల్వోలకు అందజేయాలన్నారు. ఓటర్ల సందేహాల నివృత్తి కోసం తహసీల్దార్ కార్యాలయంలో ప్రత్యేక హెల్ప్‌డెస్క్ అందుబాటులో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ దత్తాత్రి, ఎంపీడీవో నీరజ్‌కుమార్ పాల్గొన్నారు.