హైదరాబాద్, ఫిబ్రవరి 20 (నమస్తే తెలంగాణ ) : కృష్ణా బేసిన్లో తెలంగాణ ప్రాంతం నుంచి కృష్ణాలోకి వెళ్లే పడవాటి జలాలను లెక్కించాలని తెలంగాణ గురువారం బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్‌కు నివేదించింది. కేంద్ర ప్రభుత్వం జారీచేసిన సెక్షన్-3 మార్గదర్శకాల మేరకు ఇరు రాష్ర్టాల మధ్య కృష్ణాజలాల పునఃపంపిణీకి సంబంధించి బ్రిజేశ్‌కుమార్ ట్రిబ్యునల్ విచారణ రెండవరోజైన గురువారం కూడా కొనసాగింది. ట్రిబ్యునల్ చైర్మన్ జస్టిస్ బ్రిజేశ్‌కుమార్, సభ్యులు జస్టిస్ రామ్మోహన్‌రెడ్డి, జస్టిస్ ఎస్ తలపాత్ర తెలంగాణ వాదనలను విన్నారు. తెలంగాణ సీనియర్ న్యాయవాది సీఎస్ వైద్యనాథన్ పలు అంశాలను ట్రిబ్యునల్‌కు నివేదించారు. కావేరీ ట్రిబ్యునల్ అవార్డుపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా తెలంగాణ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. కావేరి, కృష్ణా బేసిన్ల మధ్య కొన్ని సారూప్యతలు ఉన్నాయని, రెండూ నీటి కొరత ఉన్న బేసిన్లేనని, సరఫరా కంటే డిమాండ్లు ఎకువగా ఉన్నాయని వివరించారు.
ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర డ్యాం నుంచి గ్రావిటీ ద్వారా కాలువ వ్యవస్థను ముందుగా చేపట్టి ఉంటే, నీటిపారుదల రంగంలో తెలంగాణ ప్రయోజనం పొందగలిగేదని చెప్పారు. బేసిన్ ప్రాంతంలోని రైతులకు కనీసం ఒక పంటకైనా సాగునీరు అందుబాటులో ఉంచవచ్చని కావేరీ ట్రిబ్యునల్ సూచించిందని గుర్తుచేశారు. కావేరీ ట్రిబ్యునల్ సూచించిన శాస్త్రీయ పద్ధతుల ఆధారంగా సాంబ రకం వరి ధాన్యం స్థానంలో స్వల్పకాలిక రకాన్ని ప్రవేశపెట్టడం, తకువ నీరు అవసరమయ్యే పంటలను పండించడం, వాస్తవిక పంట నీటి అవసరాన్ని అంచనా వేయాలని తెలిపారు. తెలంగాణ ప్రాంతంలో ఉత్పత్తి అయ్యే పడవాటి నీళ్లను తెలంగాణ ప్రాజెక్టులకు ఇవ్వాల్సి ఉన్నా, పూర్వపు ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర ప్రాంతానికి కేటాయించిందని గుర్తుచేశారు. పడవాటి నీళ్లను లెక్కించి తెలంగాణకు కేటాయించాలని ట్రిబ్యునల్‌ను కోరారు.
కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు అత్యవసరంగా శుక్రవారం సమావేశం కానున్నది. ఆంధ్రప్రదేశ్ తన వాటాకు మించి కృష్ణా జలాలను ఈ ఏడాది మళ్లించుకుపోయింది. ఏపీని నిలువరించాలని బోర్డును కోరినా ఇప్పటివరకు స్పందించలేదు. ప్రస్తుతం ఇదే అంశంపై రాజకీయ దుమారం రేగుతున్నది. ఈ నేపథ్యంలో సాగునీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌రెడ్డి బోర్డు చైర్మన్ అతుల్‌జైన్‌తో గురువారం మధ్యాహ్నం భేటీ అయ్యారు. నీటివాటాల అంశంపై చర్చించారు. ఈ నేపథ్యంలో బోర్డు శుక్రవారం అత్యవసరం సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. నీటివాటాల కేటాయింపు, డిమాండ్లు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నది. సీడబ్ల్యూసీ చైర్మన్ ఎంకే సిన్హా కూడా సమావేశానికి హాజరయ్యే అవకాశం ఉన్నట్టు సమాచారం.