రాజన్న సిరిసిల్ల, జూలై 30 (నమస్తే తెలంగాణ)/గంగాధర: సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కాంగ్రెస్ ప్రభుత్వమే కారణమని తెలంగాణ పవర్‌లూం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మూషం రమేశ్ మండిపడ్డారు. బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇవ్వకపోవడం వల్ల ఉపాధి కోల్పోయి 10 మంది కార్మికులు బలవన్మరణాలకు పాల్పడ్డారని తెలిపారు. వస్త్ర పరిశ్రమలో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ వస్త్ర పరిశ్రమ అనుబంధ సంఘాల (జేఏసీ) ఆధ్వర్యంలో మంగళవారం సిరిసిల్ల కలెక్టర్ కార్యాలయం ఎదుట ఆసాములు, యజమానులు, కార్మికులు, కార్మిక సంఘాల నాయకులు భారీ ధ ర్నా నిర్వహించారు. రమేశ్ మాట్లాడుతూ.. బతుకమ్మ చీరల ఆర్డర్లు, విద్యుత్తు, నూలు రాయితీలు బంద్ కావడంతో 30 వేల మంది కార్మికులు ఉపాధి కోల్పోయారని చెప్పారు.
సీపీఐ నాయకులు పంతం రవి మాట్లాడు తూ బతుకమ్మ పేరుతో చీరల ఆర్డర్లు ఇవ్వాల ని లేకుంటే.. ఇందిరమ్మ, సోనియమ్మ, జన తా వస్త్రాల పేరుతోనైనా ఆర్డర్లు ఇవ్వాలని ప్రభుత్వానికి సూచించారు. ధర్నాలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఆడెపు రవీందర్, పాలిస్టర్ యజమానుల సంఘం నాయకులు బొద్దుల సుదర్శన్, సామల శ్రీనివాస్, మండల సత్యం, ఆడెపు భాస్కర్, గంగుల శ్రీనివాస్, కోడం రమణ పాల్గొన్నారు. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం గర్శకుర్తి పవర్లూమ్ కార్మికుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిషరించాలని కురిక్యాల వద్ద కరీంనగర్-జగిత్యాల జాతీయ రహదారిపై చేనేత కార్మికులు రాస్తారోకో చేశారు. వారికి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ మద్దతు ప్రకటించారు. రాస్తారోకోలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు మేచినేని నవీన్‌రావు, సంఘం నాయకులు అలువాల విఠోభ, అలువాల తిరుపతి, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.