TSPE JAC | హైదరాబాద్, సెప్టెంబర్ 25 (నమస్తే తెలంగాణ) : రామగుండం థర్మల్ ప్లాంట్ను జెన్కో ద్వారానే నిర్మించాలని, సింగరేణి భాగస్వామ్యాన్ని తాము అస్సలు ఒప్పుకోబోమని తెలంగాణ పవర్ ఎంప్లాయీస్ జేఏసీ ప్రకటించింది. ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేసింది. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా దశలవారీగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. గురువారం నల్లబ్యాడ్జీలతో నిరసన తెలుపుతామని వివరించింది.
ఈ నెల 30 నుంచి అక్టోబర్ 3 వరకు జెన్కో సహా అన్ని విద్యుత్తు ఉత్పత్తి సంస్థల్లో గేట్ మీటింగ్స్, అక్టోబర్ 4, 5 తేదీల్లో మధ్యాహ్న భోజన సమయంలో అన్ని విద్యుత్తు కార్యాలయాల ఎదుట నిరసన తెలపాలని పిలుపునిచ్చింది. ఈ మేరకు మింట్ కంపౌండ్లోని 1104 కార్యాలయంలో జేఏసీ నేతలు బుధవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా జేఏసీ చైర్మన్ సాయిబాబా మాట్లాడుతూ రామగుండంలో 800 మోగావాట్ల విద్యుత్తు ప్లాంట్ను సింగరేణి భాగస్వామ్యంతో నిర్మించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్టు చెప్పారు.
ఈ స్థలం జెన్కోకు చెందినదని, కాబట్టి జెన్కో ద్వారానే ప్లాంటు నిర్మించాలని, జాయింట్ వెంచర్ విధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్పష్టంచేశారు. అక్టోబర్ 5 వరకు దశలవారీగా ఆందోళనలకు దిగుతామని, అయినా ప్రభుత్వం నిర్ణయాన్ని వెనక్కి తీసుకోకపోతే అక్టోబర్ 5 తర్వాత కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు.