హైదరాబాద్, మే 22 (నమస్తే తెలంగాణ): సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) విధానంతో ఒక్క నెలలోనే సుమారు వెయ్యికిపైగా ఫోన్లను యజమానులకు అప్పగించారు తెలంగాణ పోలీసులు. మొబైల్ దొంగతనాలను అరికట్టడానికి రాష్ట్రంలో ఏప్రిల్ 19 నుంచి సీఈఐఆర్ వ్యవస్థ అనధికారికంగా పని చేయడం ప్రారంభించింది. ఏప్రిల్ 13న డీజీపీ అంజనీకుమార్ తెలంగాణలో 60 మంది మాస్టర్ ట్రైనర్లకు ఒక రోజు శిక్షణ నిర్వహించారు. ఏప్రిల్ 18 నుంచి రాష్ట్రంలోని సుమారు 31 పోలీస్ యూనిట్ల పరిధిలోని 780 పోలీస్స్టేషన్లకు సీఈఐఆర్ యూజర్ ఐడీలను పంపిణీ చేశారు. నాటి నుంచి ఈ వ్యవస్థ విధులు నిర్వర్తించడం ప్రారంభించింది. జాతీయ స్థాయిలో ఈ నెల 17న సీఈఐఆర్ వ్యవస్థ అధికారికంగా అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 20 నుంచి మే 22 వరకు అంటే.. నెల వ్యవధిలోనే చోరీకి గురైన, పోగొట్టుకున్న వెయ్యికంటే ఎక్కువ ఫోన్లను బ్లాక్ చేసి, వాటిని ట్రేస్ చేసి, నిజమైన యజమానులకు అప్పగించారు.
నోడల్ ఆఫీసర్‌గా మహేశ్ భగవత్
సీఈఐఆర్ వ్యవస్థకు నోడల్ ఆఫీసర్‌గా సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్ నియమితులయ్యారు. ఈయన ‘సూపర్ యూజర్’గా ఎప్పటికప్పుడు పోయిన ఫోన్ల పురోగతిని పర్యవేక్షిస్తుంటారు. సిబ్బంది సైతం పోయిన ఫోన్ల జాడను చురుగ్గా వెతికేపనిలో నిమగ్నమయ్యారు. ఈ ఏడాది ఏప్రిల్ 20 నుంచి సోమవారం వరకు 16,011 ఫోన్లు బ్లాక్ చేయగా.. వీటిల్లో 4,226 ఫోన్ల ట్రేస్ చేశారు. వీటిల్లో 1,016 ఫోన్లను జాడ కనుగొని వాటిని నిజమైన యజమానులకు చేరేలా తెలంగాణ పోలీసులు కృషి చేశారు. ఇందులో ఫోన్ల ట్రేసింగ్ శాతం 26.39 ఉండగా.. రికవరీ శాతం 24.05గా ఉన్నది. అన్ని పోలీసు విభాగాలు సహకరిస్తుండటం వల్లే అనతికాలంలో రికవరీ శాతం ఎక్కువగా ఉన్నదని డీజీపీ అంజనీకుమార్ తెలిపారు. సీఈఐఆర్ ఉపయోగిస్తూ.. పౌరులకు విశేష సేవలందిస్తున్న సీఐడీ ఏడీజీ మహేశ్ భగవత్, డీడీజీ సెక్యూరిటీ కే రాజశేఖర్, డైరెక్టర్ సెక్యూరిటీ మురళీకృష్ణ, అడిషనల్ డైరెక్టర్ రాఘవరెడ్డి, సైబర్ క్రైమ్స్ ఎస్పీ (సీఐడీ) లావణ్యజాదవ్, ఇతర పోలీస్ ఉన్నతాధికారులను డీజీపీ అభినందించారు. సీఈఐఆర్ విధానంతో ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 4,96,570 ఫోన్లను బ్లాక్ చేశారు. వీటిల్లో 2,46,994 మొబైల్స్‌ను ట్రేస్ చేశారు.