హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 3(నమస్తే తెలంగాణ): మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హత్యకు కుట్ర పన్నిన కేసులో మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డితో పాటు ఆయన పీఏ రాజుకు, మరికొందరికి సైబరాబాద్ పోలీసులు త్వరలో నోటీసులు జారీ చేయనున్నట్టు సమాచారం. కుట్ర కేసులో ప్రధాన నిందితుడు రాఘవేంద్రరాజు, మధుసూదన్‌రాజు, మున్నుర్ రవి ఢిల్లీకి వెళ్లి, అక్కడ మాజీ ఎంపీ జితేందర్‌రెడ్డి పీఏ రాజును సంప్రదించి సర్వెంట్ క్వార్టర్స్‌లో ఉన్న విషయంలో తెలిసిందే. ఈ నేపథ్యంలో పోలీసులు ముందుగా పీఏ రాజుకు నోటీసులు ఇచ్చి.. రాఘవేంద్రరాజు అక్కడకు ఎందుకు వచ్చాడు? మంత్రి హత్యకు కుట్ర గురించి ఏమైనా చెప్పాడా? రాజుతో ఎన్ని రోజుల నుంచి టచ్‌లో ఉన్నారు? ఇదే అంశంపై జితేందర్‌రెడ్డిని ఏమైనా కలిశారా? అక్కడ ఉన్నప్పుడు నిందితులు ఏమి మాట్లాడారు? ఎక్కడెక్కడ తిరిగారు? వీరంతా ఇక్కడ ఆశ్రయం పొందిన విషయం మాజీ ఎంపీకి తెలుసా? తదితర విషయాలపై సమాచారం సేకరించనున్నారు. మరోవైపు సైబరాబాద్ పోలీసులు సాంకేతిక దర్యాప్తులో భాగంగా రాఘవేంద్రరాజు మొబైల్ ఫోన్‌ను విశ్లేషించారు. దీంతో జితేందర్‌రెడ్డి వాట్సాప్‌లో ప్రధాన నిందితుడితో చాట్ చేసినట్టు ఆధారాలు లభించాయని తెలుస్తున్నది. అయితే, ఈ చాటింగ్ హత్య కుట్రకు సంబంధించినదా? రాఘవేంద్రరాజుకు ఆర్థిక సహాయానికి సంబంధించినదా? అనే అంశాన్నే పరిశీలిస్తున్నారు. దీనిపై మరిన్ని ఆధారాలను సేకరించిన తర్వాత జితేందర్‌రెడ్డికి కూడా నోటీసులు ఇచ్చి, విచారించే అవకాశం ఉన్నట్టు సమాచారం. చట్టపరంగా విచారణలో వెలుగుచూసే ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా విశ్లేషించుకొంటూ, పాత్ర ఉన్నట్టు తేలిన ప్రతి ఒక్కరినీ విచారించేందుకు పోలీసులు ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తున్నది. ప్రాథమికంగా మంత్రి హత్యకు కుట్ర కేసులో పలువురు ప్రముఖులు ఆర్థిక సహాయం చేసి, ఉండొచ్చని పోలీసువర్గాలు అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. సున్నితమైన అంశం కావడంతో పోలీసు అధికారులు దర్యాప్తును గోప్యంగా సాగిస్తున్నారు.