హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్)లో రూ.18,900 కోట్లు రుణ సమీకరణ చేయగా, రెండో త్రైమాసికంలో అంతకుమించి అప్పు తీసుకోబోతున్నది. జూలై నుంచి సెప్టెంబర్ వరకు రూ.21,000 కోట్ల మేర ఓపెన్ మార్కెట్ రుణాలు తీసుకోబోతున్నట్టు ఆర్బీఐకి రాష్ట్ర ఆర్థిక శాఖ ప్రతిపాదనలు పంపింది. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రపాలిత ప్రాం తాలు జూలై నుంచి సెప్టెంబర్ 2026 రెండో త్రైమాసికంలో చేయబోయే మారెట్ రుణాల (అప్పుల) అంచనా క్యాలెండర్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) శుక్రవారం విడుదల చేసింది. ఈ త్రైమాసికంలో (క్యూ2) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి మొత్తం రూ.3,18,816 కోట్ల మారెట్ రుణాలు సేకరించవచ్చని ఆర్బీఐ అంచనా వేసింది. ఈ క్యాలెండర్ సూచిక మాత్రమేనని, అసలు రుణాల మొత్తం, వేలంలో పాల్గొనే రాష్ట్రాల తుది వివరాలను వేలానికి రెండు లేదా మూడు రోజుల ముందు ప్రెస్ రిలీజ్ ద్వారా ప్రకటిస్తామని వెల్లడించింది.
రిజర్వు బ్యాంకు విడుదల చేసిన క్యూ-2 క్యాలెండర్ ప్రకారం.. తెలంగాణ ప్రభు త్వం.. ఒక్క జూలైలోనే రికార్డుస్థాయిలో రుణ సమీకరణ చేయబోతున్నది. జూలై 1న రూ.7,000 కోట్లు, జూలై 14న మరో రూ.3,500 కోట్లు, జూలై 28న మరో రూ.1,000 కోట్లు ఓపెన్ మార్కెట్ కింద అప్పు తీసుకోబోతున్నది. ఇలా ఒక్క జూలైలోనే రూ.11,500 కోట్లు రుణ సమీకరణ చేయబోతున్నది. అలాగే ఆగస్టులో రెండు దఫాలుగా రూ.4500 కోట్లు, సెప్టెంబర్లో రెండు దఫాలుగా రూ.2500 కోట్ల చొప్పన రూ.5,000 కోట్లు తీసుకోబోతున్నది. ఇలా క్యూ-2లో రూ.21,000 కోట్లు ఓపెన్ మార్కెట్ అప్పులు చేయబోతున్నది.
తెలంగాణ ప్రభుత్వం 2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన బడ్జెట్లో రూ.73,383 కోట్ల మొత్తాన్ని ఓపెన్ మారెట్ రుణాల రూపంలో సేకరించాలని ప్రతిపాదించింది. డిప్యూటీ సీఎం, ఆర్థికశాఖ మంత్రి భట్టి విక్రమార అసెంబ్లీలో ప్రవేశపెట్టిన మొత్తం 3.24 లక్షల కోట్ల బడ్జెట్లో ఓపెన్ మారెట్ రుణాలు రూ.73,383 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి రుణాలు రూ.5,500 కోట్లు, ఇతర వనరుల ద్వారా రుణాలు రూ.1,000 కోట్లు.. ఇలా మొత్తం రుణాలు దాదాపుగా రూ.79,984 కోట్లు తీసుకుంటామని ప్రతిపాదించారు. ఈ మొత్తం రుణం రాష్ట్ర మొత్తం రాబడుల అంచనాల్లో దాదాపు 25 శాతానికి సమానం కావడం గమనార్హం. బడ్జెట్ అంచనాల ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరంలో పాత అప్పుల చెల్లింపుల కోసం రూ.23,025 కోట్లు కేటాయించగా, నికర రుణాలు రూ.56,959 కోట్లుగా ఉండనున్నాయి.
హైదరాబాద్, జూన్ 26 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ సర్కార్ జూలై ఒకటిన మరో రూ.7000 కోట్లు అప్పు తీసుకోబోతున్నది. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఆర్థికశాఖ బాండ్లను పెట్టినట్టు రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో తొలి త్రైమాసికం (ఏప్రిల్, మే, జూన్)లో ఇప్పటికే ఓపెన్ మార్కెట్ రుణాల కింద ఒక్క ఆర్బీఐ వద్దనే రూ.18,900 కోట్ల రుణ సమీకరణ చేసిన రేవంత్రెడ్డి సర్కారు.. వచ్చే త్రైమాసికానికి కూడా ఇంకా భారీగా రుణసమీకరణ చేయబోతున్నది. అందులో భాగంగానే మంగళవారం ఆర్బీఐ నిర్వహించే ఈ వేలంలో పాల్గొని జూలై ఒకటిన రూ.7,000 కోట్లు రుణం తీసుకోనున్నది. ప్రతినెలా ఆర్బీఐ నుంచి రూ.6,000 కోట్లకుపైగా అప్పులు చేస్తున్నది. గత ఏడాది కూడా బడ్జెట్ ప్రతిపాదనలకు మించి 124 శాతం అప్పులు తీసుకున్న కాంగ్రెస్.. ఈ సారి కూడా అదేదిశలో వేగంగా అడుగులు వేస్తుండటంపై ఆర్థిక నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
