మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. కూల్చివేతలకు గురయ్యే బాధితులు 2013 భూసేకరణ చట్టం, మార్కెట్ విలువ ప్రకారం మెరుగైన పరిహారం కోరుతున్నా సర్కార్ పెడచెవిన పెడుతున్నది.
తెలంగాణ ప్రభుత్వం మూసీ రివర్ఫ్రండ్ డెవలప్మెంట్ ప్రాజెక్టును రూ.1.5 లక్షల కోట్లతో చేపట్టనున్నట్టు చెప్తున్నది. 55 కిలోమీటర్ల మేర విస్తరించిన ఈ ప్రాజెక్టు ద్వారా హైదరాబాద్‌ను లండన్, సియోల్ తరహాలో ప్రపంచ స్థాయి నగరంగా తీర్చిదిద్దుతామని అంటున్నది. మూసీ నది సుందరీకరణ పేరుతో ప్రభుత్వం చెప్తున్న మాటలు శాస్త్రీయ పద్ధతులకు విరుద్ధంగా ఉన్నాయి. నదిని పునరుద్ధరించడానికి ముందుగా జలాల్లోని జీవావరణ వ్యవస్థల గురించి శాస్త్రీయమైన అధ్యయనం చేయాల్సి ఉంటుంది. ఇందుకోసం అంకితభావంతో ప్రణాళికలు రచించాలి. కానీ ప్రభుత్వం మాత్రం ప్రస్తుత చర్చ మొత్తం రియల్ ఎస్టేట్ పరంగానే జరుగుతున్నది. నది అంటే కేవలం అందమైన నడక మార్గాలకు ఒక కారిడార్ మాత్రమే కాదు, అది తనలోని నీటి ప్రవాహ ప్రాంతం, రసాయనాల సమతుల్యతకు సంబంధించిన అస్తిత్వం.
మూసీ రివర్‌ఫ్రంట్ డెవలప్మెంట్ ప్రాజెక్టుకు ప్రభుత్వం భారీ బడ్జెట్ చూపిస్తున్నది. అయితే మూసీ నదీగర్భంలో భారలోహాలు, ఔషధ కంపెనీల నుంచి వెలువడిన వ్యర్థాలు నిండి ఉన్నాయి. కాబట్టి కాలుష్యంతో కూడిన నదిని శుద్ధి చేయడం కోసం ప్రత్యేక అధ్యయనం జరగాలి. కానీ ప్రభుత్వం ప్రతిపాదిస్తున్న ప్రాజెక్ట్ నమూనాలో ఎలివేటెడ్ కారిడార్లు, కాంక్రీట్ కట్టలు, రియల్ ఎస్టేట్ జోన్ల వంటి నిర్మాణాలకే ప్రాధాన్యత ఇస్తున్నది. 50 మీటర్ల బఫర్‌జోన్ నిబంధన పేరుతో ముందుగా కూల్చివేతలకు పాల్పడుతున్నది. ప్రభుత్వం అసలు డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ కూడా తయారు, పర్యావరణపరమైన అధ్యయనం చేయకుండానే 3,279.19 ఎకరాల భూమిని స్వాధీనం చేసుకుంటామని చెప్తున్నది. దీంతో చట్టబద్ధంగా నిర్మించుకున్న 10,017 ఇండ్లు కూల్చివేత ముప్పులో ఉన్నాయి. ఇందులో ఇటీవల పేద, మధ్యతరగతి ప్రజల ఇండ్లు, గేటెడ్ కమ్యూనిటీలు కూడా ఉన్నాయి.
మూసీ ప్రాజెక్టు పేరుతో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తున్నది. కూల్చివేతలకు గురయ్యే బాధితులు 2013 భూసేకరణ చట్టం, మార్కెట్ విలువ ప్రకారం పరిహారం మెరుగైన పరిహారం కోరుతున్నారు. కానీ ప్రభుత్వం పెడచెవిన పెడుతున్నది. కానీ ప్రభుత్వం ట్రాన్స్‌ఫరేబుల్ డెవలప్మెంట్ రైట్స్ (టీడీఆర్) సర్టిఫికెట్స్‌కు అంగీకరించాలని ఒత్తిడి చేస్తున్నది. టీడీఆర్‌ల ద్వారా అందే పరిహారం మార్కెట్ విలువలో కేవలం 20 శాతం కూడా ఉండదు. ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని విస్మరిస్తూ హక్కుదారులైన ప్రజలను నిర్లక్ష్యం చేస్తున్నది. పన్నులు చెల్లిస్తూ చట్టబద్ధంగా నివాసం ఉంటున్న వారిని నిరాశ్రయులను చేయడానికి ఒంటెత్తు పోకడతో వ్యవహరిస్తున్నది.
దశాబ్దాలుగా కాలుష్య నియంత్రణ మండలి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. మూసీ కాలుష్యాన్ని నియంత్రించాలన్న బాధ్యతను మరిచిపోయి, కేవలం పన్నులు వసూలు చేసే సంస్థగా మారిపోయింది. ఎన్నో ఏండ్లుగా శాస్త్రవేత్తలు చేసిన హెచ్చరికలను కూడా పట్టించుకోవడంలేదు. పాశమైలారం, పటాన్చెరు వంటి పలు ప్రాంతాల్లోని ఫార్మా కంపెనీలు వెదజల్లుతున్న కాలుష్యం మూసీని విషపూరితంగా మార్చింది. సీసం, పాదరసం, క్రోమియం, ఆర్సెనిక్, కాడ్మియం వంటి భారలోహాలు పెద్దఎత్తున మూసీలో కలుస్తున్నాయి.
ప్రభుత్వం నదిని శుద్ధి చేయకుండా ఇండ్లను కూలగొట్టే సరిహద్దు 50 మీటర్ల బఫర్‌జోన్ నిబంధన పెట్టుకున్నది. నీటిని, నదీగర్భాన్ని శుభ్రం చేయకుండా కాంక్రీటు కట్టడాల నిర్మాణం, అలంకరణ కోసం ఏర్పాటు చేసే పచ్చికలతో ప్రయోజనం లేదు. అంతేకాదు ప్రభుత్వం అనాలోచిత వైఖరితో మరింత ప్రమాదం కూడా పొంచి ఉన్నది. అది ఎలాగంటే, ప్రమాదకరమైన వ్యర్థాలు కలిగిన నదీగర్భాన్ని శుద్ధి చేయకుండా పూడిక తీస్తే.. ఆ విషపూరిత రసాయనాలు గాలిలోకి వ్యాపించి, సమీప నివాసాల్లోని ప్రజలకు ముప్పు వాటిల్లే ప్రమాదం ఉన్నది. మూసీ నదీగర్భంలో సిప్రోఫ్లోక్సాసిన్, డైక్లోఫెనాక్ వంటి ఔషధ వ్యర్థాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నాయని ఐఐసీటీ, ఆస్ట్రేలియాకు చెందిన సీఎస్ఐఆర్వో హెచ్చరించాయి. ఇలాంటి రసాయన మిశ్రమాల కారణంగా నదిలో సూక్ష్మజీవులు నివసించలేవు. పర్యావరణం దెబ్బ తింటుంది.
మూసీ ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం సామాజిక, పర్యావరణ ప్రభావం గురించి అధ్యయనం చేయాలి. కానీ జీవో 921 ద్వారా సర్వే చేయాల్సిన అవసరం లేకుండా దాటవేత ధోరణి అనుసరిస్తున్నది. జీరో లిక్విడ్ డిశ్చార్జ్‌ను అమలు చేయకుండా విషపూరిత ప్రభావంపై అధ్యయనం చేయకుండా ప్రభుత్వం అనాలోచితంగా వ్యవహరిస్తున్నది. విషపూరితమైన రసాయాలు కలిగిన నదీ పరీవాహక ప్రాంతంలో నిర్మాణాలు చేపట్టడం నిరుపయోగం. ముందుగా చిత్తడి నేలల అభివృద్ధి ద్వారా రసాయన, జీవ పునరుద్ధణ జరిగేలా చూడాలి. నదిలో విషపూరిత రసాయనాలను తొలగించకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టినా పునరుద్ధరణ ముసుగులో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసినట్టుగానే భావించాల్సి ఉంటుంది. ప్రభుత్వం సబర్మతి వంటి పలు సుందరీకరణ ప్రాజెక్టులను ఉదహరిస్తున్నది. కానీ వాటన్నింటితో పోల్చితే మూసీ నది పరిస్థితి ప్రత్యేకం. ఎందుకంటే ఇక్కడ నదీ గర్భంలో విషపూరిత రసాయనాలు ఉన్నాయి. వీటి శుద్ధి ద్వారా మూసీకి జీవ పునరుద్ధరణ చేపట్టడం అత్యవసరం. బయోరిమెడియేషన్ అనేది ఒక పర్యావరణ అనుకూల ప్రక్రియ. ఇది నేల, నీరు, గాలిలోని హానికరమైన కాలుష్య కారకాలను విచ్ఛిన్నం చేస్తుంది. బ్యాక్టీరియా, శిలీంద్రాలు, మొక్కలను వినియోగించి భారలోహాలు, విషపూరిత రసాయనాలను హానిరహిత ఉప ఉత్పత్తులుగా విడదీస్తుంది. ఇలాంటి శాస్త్రీయ పద్ధతులను అనుసరించకుండా కేవలం కాంక్రీట్ నిర్మాణాలతో సరిపెడితే, అది మూసీ పునరుజ్జీవం కాదు, మూసీకి శాశ్వత సమాధి అవుతుంది.
అహ్మదాబాద్‌లోని సబర్మతి నది ప్రాజెక్ట్‌ను గొప్పగా ఉదహరిస్తారు కానీ అది హెచ్చరికగానే చూడాలి. అక్కడ నదిలో నీరు నీలిరంగులో, పరిశుభ్రంగా కనిపిస్తున్నప్పటికీ, అది ఒక నిశ్చలమైన కాలువ. ఎగువన ఉన్న ఆనకట్టలు సహజ ప్రవాహాన్ని అడ్డుకున్నాయి. ప్రజలకు కనిపించే నీరు తరచుగా నర్మదా కాలువ నుంచి మళ్లించినదే. ప్రస్తుత మూసీ ప్రతిపాదన మాదిరిగానే, సబర్మతి ప్రాజెక్టులో కూడా చాలా మంది నిర్వాసితులుగా మారారు. సబర్మతి నదిని ఒక కాంక్రీట్ తొట్టిగా నిర్మించారు. ఆ ప్రాజెక్టే గొప్పదని చెప్తూ మూసీ విషయంలోనూ అదే పద్ధతులను అనుసరిస్తే మూసీ కూడా నిశ్చల జలాశయంగా మారే ప్రమాదమున్నది.
పుణెలోని ములా-ముఠా నది ప్రాజెక్టులో భాగంగా పెద్దఎత్తున చెట్లను నరికివేశారు. నదీతీర ప్రాంతాలను ధ్వంసం చేశారు. దీంతో ప్రజల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వ్యక్తమైంది. మూసీ ప్రాజెక్టు విషయంలో కూడా ప్రభుత్వం బఫర్జోన్లను ఎంచుకున్న తీరుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. ప్రభుత్వం నదిని శుభ్రం చేయడానికి అన్నట్టుగా కాకుండా ఇండ్లు కూలగొట్టి నేలను చదును చేయాలని చూస్తున్నది. బెంగళూరులోనూ సరస్సు పరీవాహక ప్రాంతాల అభివృద్ధి ప్రాజెక్టులో కూడా పెద్దఎత్తున నిర్వాసితులయ్యారు. సరస్సుకు కంచె వేసి, ఆ సరస్సును ప్రజల నుంచి వేరు చేసినట్టుగా మార్చారు. పుణె, బెంగళూరు ఉదాహరణల నుంచి రాష్ట్ర ప్రభుత్వం గుణపాఠం నేర్చుకోవాలి. లేకపోతే పర్యాటకం, రియల్ ఎస్టేట్ కారిడార్ల నిర్మాణం పేరుతో ప్రణాళికలు రచిస్తే మాత్రం తీవ్రమైన నష్టం జరుగుతుంది.
ప్రభుత్వం చెప్తున్న మాటలకు, క్షేత్రస్థాయిలో వాస్తవాలకు పొంతనలేదు. తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి రూ.7,000 కోట్లతో 27 మురుగునీటి శుద్ధి ప్లాంట్లు(ఎస్టీపీలు) ఏర్పాటు చేశామని చెప్తున్నది. పారిశ్రామిక వ్యర్థాల్లో విషపూరిత రసాయనాలకు సంబంధించి 1,664 తనిఖీలు చేసినట్టు పేర్కొన్నది. కాలుష్య నియంత్రణ మండలి నాలుగు దశాబ్దాల నిర్లక్ష్యంతో మూసీ నదిని విషపూరిత మురుగు నీటి కాలువగా, అత్యంత తక్కువ ఆక్సిజన్ స్థాయులు కలిగిన నీటి వనరుగా మార్చింది. ఇప్పటికే అనేక శాస్త్రీయమైన అధ్యయనాలు కూడా తీవ్రమైన హెచ్చరికలు చేశాయి. ప్రభుత్వం 2.5 టీఎంసీల గోదావరి జలాలను మూసీలోకి మళ్లించడం ద్వారా కాలుష్యాన్ని సమూలంగా ప్రక్షాళన చేస్తామని అంటున్నది. కానీ ఇది తక్కువ శ్రమతో కూడుకున్న పద్ధతిగా కనిపిస్తున్నది. కానీ ఇప్పటికే నదీ గర్భంలోకి ఇంకిపోయి, పరీవాహక ప్రాంతాల్లోని పంట భూముల్లోకి కూడా విషపూరిత రసాయనాలు చేరిపోయాయి. కాబట్టి ఔషధ పరిశ్రమలు నదిలోకి విష రసాయనాలు విడుదల చేయకుండా పీసీబీ నిరంతర పర్యవేక్షణపై దృష్టి పెట్టాలి.
మూసీ నదీ తీర అభివృద్ధి విషయంలో ప్రభుత్వం చెప్తున్న ప్రణాళికలో నిజమైన పర్యావరణ పునరుద్ధరణ కంటే రియల్ ఎస్టేట్ వ్యాపార దృక్పథమే కనిపిస్తున్నది. అందుకే ప్రభుత్వం చెప్తున్న నమూనా పట్ల ప్రజలకు నమ్మకం కలుగడంలేదు. పారదర్శకమైన సామాజిక అధ్యయనం ఏమీ చేయకుండా ఇండ్లు ఖాళీ చేయాలంటూ యజమానులకు నోటీసులు జారీ చేసింది.
అసెంబ్లీలో ముఖ్యమంత్రి ఆర్భాటపు హామీలు ఇచ్చారు. కానీ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ లేకుండా, విధానపరమైన పత్రాలు ఏమీ లేకుండా ప్రజలు ఎందుకు విశ్వసిస్తారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మంత్రివర్గం ఉపసంఘం పూర్తిగా రాజకీయ నియామకంగానే కనిపిస్తున్నది. ఆ కమిటీ కూడా రాజకీయ సంప్రదింపులకు మాత్రమే పరిమితమైనట్టుగా ఉన్నది. మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులా కాకుండా పర్యావరణ పునరుద్ధరణ ప్రాజెక్టుగా భావించాలి. ప్రభుత్వం శాస్త్రీయమైన సామాజిక అధ్యయనం చేయాలి. తరతరాలుగా నివసిస్తున్న వారి ఇండ్లకు చట్టపరమైన హక్కులు కల్పించాలి. కేవలం ఇండ్ల తొలగింపునే ప్రాధాన్యతగా పెట్టుకోకూడదు.
ప్రభుత్వం మూసీ కాలుష్య నియంత్రణ, కాలుష్య నివారణపై దృష్టి పెట్టాలి. నదీ గర్భంలోని విషపూరిత రసాయనాల తొలగింపుపై దృష్టి పెట్టాలి. నాలాలు మూసీలోకి మురుగు నీరు వదిలే ప్రాంతాల్లో తప్పనిసరిగా ఎస్టీపీలు ఏర్పాటు చేయాలి. కాలుష్య కారకాలను నదిలోకి వదిలే పరిశ్రమల యజమానులపై కఠినంగా వ్యవహరించాలి. అంతేకాకుండా నదీ గర్భంలో పేరుకుపోయిన భారలోహాల పొరను తొలగించాలి. విషపూరిత రసాయనాల తొలగింపు కోసం డిస్టీలింగ్ పద్ధతిని అనుసరించాలి. నదిలో జీవావరణ సమగ్రత అంటే నదిలో వివిధ జీవాలు మనుగడ సాగించేలా పభుత్వం ప్రణాళికలు రచించాలి. ఆ ప్రణాళికల ఆధారంగా నదిలో ఆ మేరకు వాతావరణం కల్పించాలి. 9-30 మీటర్ల బఫర్‌జోన్‌లో వివిధ వృక్ష జాతులను పెంపొందించాలి. జీవావరణ వ్యవస్థను బరువైన కాంక్రీటు గోడలతో కప్పివేయకూడదు. రాజకీయ కమిటీలు కాకుండా నిపుణులతో అధ్యయం చేయించాలి. జలశాస్త్రవేత్తలు, పర్యావరణ శాస్త్రవేత్తలు, స్థానిక ప్రతినిధులను భాగస్వాములు చేయాలి. నదీతీర ప్రాంతాల్లో నివసించే వారిలో ఇప్పటికే శ్వాసకోశ, చర్మ సంబంధ సమస్యలు కనిపిస్తున్నాయి. అందుకే భూగర్భ జలాల్లోని విషాన్ని తగ్గించేంత వరకు ప్రభుత్వం సుందరీకరణ పేరుతో ప్రాజెక్టును చేపట్టవద్దు. అలా చేస్తే పర్యావరణ పునరుద్ధరణ ముసుగులో చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారంగానే మిగిలిపోతుంది. జీవ పునరుద్ధరణ లేని సుందరీకరణ వ్యర్థం.