కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావును విమర్శించే నైతిక హక్కు లేదని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్‌పై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసిన స్మృతి ఇరానీపై వినోద్ కుమార్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ఈ మేరకు కేంద్రమంత్రి స్మృతి ఇరానీకి వినోద్ కుమార్ ఘాటు లేఖ రాశారు. స్మృతి ఇరానీ వ్యాఖ్యలు క్షమార్హం కాదన్నారు. సీఎం కేసీఆర్‌పై విమర్శలు చేసే ముందు వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
సంస్కారం గురించి మాట్లాడే బీజేపీ నాయకులకు ఎక్కడ ఉందని స్మృతి ఇరానీని వినోద్ కుమార్ ప్రశ్నించారు. విపక్ష పార్టీల సీఎంలను, నేతలను కించపరచడం, మర్యాద లేకుండా వ్యవహరించడం ప్రధాని నరేంద్రమోదీ సహా బీజేపీ నేతలకు వెన్నతో పెట్టిన విద్య అని ఆరోపించారు.
కరోనాను అరికట్టడానికి భారత్ బయోటెక్ అభివృద్ధి చేసిన వ్యాక్సిన్ గురించి తెలుసుకోవడానికి 2020 నవంబర్ 28న ప్రధాని మోదీ హైదరాబాద్ పర్యటనకు వచ్చారని వినోద్ కుమార్ గుర్తు చేశారు. ఈ సమయంలో ప్రధాని మోదీని సగౌరవంగా ఆహ్వానించేందుకు సీఎం కేసీఆర్ సిద్ధమైతే.. ఢిల్లీలోని పీఎంవో అధికారులు.. నోనో కేసీఆర్ జీ.. మీరు రావొద్దు. మీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిని పంపండి అని ఆదేశించారని గుర్తు చేశారు. ప్రధాని మోదీకి ఆహ్వానం పలికేందుకు విమానాశ్రయానికి రాకుండా సీఎం కేసీఆర్‌ను అడ్డుకున్నదెవరన్న సంగతి ఇప్పటి వరకు ఎవరూ చెప్పడం లేదన్నారు.
రాజ్యాంగాన్ని, సంస్కృతిని, మతసామరస్యాన్ని గౌరవించి, అమలు చేయడం సీఎం కేసీఆర్‌కు తెలిసినంత దేశంలోని ఏ రాజకీయ నేతకూ తెలియదని వినోద్ కుమార్ స్పష్టం చేశారు. తెలంగాణది గంగా జమునా తెహజీబ్ సంస్కృతి అని గుర్తు చేశారు. `2004 – 2009, 2014 – 2019 మధ్య తాను ఎంపీగా ఉన్నప్పుడు తనను కలిసిన పలువురు రాష్ట్రపతులు, ప్రధానమంత్రులు, ఇతర ప్రముఖులను సీఎం కేసీఆర్ తెలంగాణలో ప్రఖ్యాత పోచంపల్లి హ్యాండ్లూమ్ శాలువతాతో సత్కరించారు. వారి పట్ల అపార గౌరవ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ విషయం తాను దగ్గర ఉండి చూశాను` అని తెలిపారు.
ప్రధాని హోదాలో వచ్చేవారికి ముఖ్యమంత్రిగా ఆహ్వానం పలుకడం కనీస బాధ్యత అని సీఎం కేసీఆర్‌కు తెలిసినంత మరెవరికి తెలియదని వినోద్ కుమార్ చెప్పారు. కానీ, భారత్ బయోటెక్ సందర్శనకు వచ్చిన ప్రధాని మోదీకి స్వాగతం పలికేందుకు రాకుండా ఆయన ఆదేశాల మేరకే పీఎంవో అధికారులు అడ్డుకున్నారని.. ఇదే ప్రధాని మోదీ, బీజేపీ నేతల సంస్కారం అని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వాస్తవాలు కేంద్ర మంత్రి స్మృతి ఇరానీకి తెలియకపోవడం దారుణమని, వాస్తవాలు తెలుసుకుని మాట్లాడాలని హితవు పలికారు.
ప్రపంచ ప్రఖ్యాతి పొందిన భారత్ బయోటెక్ సంస్థ.. కరోనా వ్యాక్సిన్ కనుగొన్నదని, అది తెలంగాణ రాజధాని హైదరాబాద్ సంస్థ అన్న సంగతి మరువొద్దని వినోద్ కుమార్ గుర్తు చేశారు. కానీ ఈ వ్యాక్సిన్ వేసుకున్న వ్యక్తులకు జారీ చేసే ధృవీకరణ పత్రంపై మాత్రం ప్రధాని మోదీ ఫొటో వాడటం ఎంత వరకు సమంజసం అని ప్రశ్నించారు. ప్రధాని నరేంద్ర మోదీని మించిన మాస్టర్ సేల్స్ మెన్ మరెవ్వరూ లేరని వినోద్ కుమార్ అన్నారు. సొంత డబ్బా కొట్టుకోవడంలోనూ నరేంద్ర మోదీకి మించిన వ్యక్తి మరొకరు లేరన్నారు. కానీ, దుష్ట-విష ప్రచారం మానుకుని వాస్తవాలు గ్రహించి మాట్లాడాలని సూచించారు.