Telangana | ప్రపంచ ఆరోగ్య దినోత్సవం( World Health Day ) సందర్భంగా తెలంగాణ రాష్ట్రానికి మరో గౌరవం దక్కింది. దేశంలో నర్సింగ్ వృత్తిలో విశిష్ట సేవలందిస్తున్న పది మంది నర్సింగ్ ఆఫీసర్స్‌ను ఇండియన్ మెడికల్ అసోసియేషన్ నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డు( Nursing Excellence Award )తో సత్కరించింది. తెలంగాణ రాష్ట్రం నుంచి నిలోఫర్( Niloufer ) వైద్య కాలేజీలో గ్రేడ్ 2 నర్సింగ్ సూపరింటెండెంట్‌గా పని చేస్తున్న కే పుష్ప( Nurse K Pushpa ) నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డును అందుకున్నారు.
ప్రపంచ ఆరోగ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇండియన్ మెడికల్ అసోసియేషన్( IMC ) వారు ఢిల్లీ హెడ్ క్వార్టర్స్‌లో సమర్పన్ దివస్ నిర్వహించిన సందర్భంగా ఈ అవార్డులను అందజేశారు. నర్సింగ్ ఎక్సలెన్స్ అవార్డులను కేంద్ర మంత్రి డాక్టర్ ముంజపర మహేంద్ర భాయ్, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు డాక్టర్ శారద్ కేఆర్ అగర్వాల్, ఇండియన్ నర్సింగ్ కౌన్సిల్ ప్రెసిడెంట్ డాక్టర్ దిలీప్ కుమార్ చేతుల మీదుగా అందజేశారు.
ఈ సందర్భంగా కే పుష్ప మాట్లాడుతూ.. ఈ అవార్డు తనకు రావడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఇది తనకు దక్కిన గౌరవం కాదు.. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ సమాజానికి దక్కిన గౌరవంగా భావిస్తున్నానని తెలిపారు. తన 38 సంవత్సరాల సర్వీసులు ఎంతో మంది రోగులకు సేవలందించానని పేర్కొన్నారు. ఆ రోగులంతా కోలుకుని చిరునవ్వుతో ఇండ్లకు వెళ్తుంటే.. అదే పెద్ద అవార్డులా భావించేదాన్ని అని పుష్ప చెప్పారు. మారూముల ప్రాంతాల్లోను పర్యటించి ఆరోగ్య సేవలందించాను. ఇప్పుడు ఈ అవార్డు రావడం తన భాద్యతను మరింత పెంచిందన్నారు. రాష్ట్రంలోని నర్సులను సీఎం కేసీఆర్, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావుతో పాటు వైద్యశాఖ అధికారులు తమను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. నిలోఫర్ మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఉషారాణి నర్సులకు అన్ని విధాలుగా అండగా ఉండి ముందుకు నడిపిస్తున్నారని పుష్ప పేర్కొన్నారు.