జనగామ (కొడకండ్ల) : ఉపాధి హామీ పథకం అమలులో తెలంగాణ రాష్ట్రం నెంబర్ వన్ గా ఉందని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు(Minister Errabelli ) వెల్లడించారు. శనివారం నియోజకవర్గంలో వివిధ అభివృద్ధి కార్యక్రమాల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయడానికి వెళుతూ కొడకండ్ల మండలం రామన్న గూడెం వద్ద రోడ్డుకు ఇరువైపులా మొక్కలకు పాదులు తవ్వుతూ, పిచ్చి మొక్కలను తొలగిస్తున్న ఉపాధి హామీ కూలీల(EGS Labours)తో మంత్రి ముచ్చటించారు.
ఈ సందర్భంగా ఎండాకాలంలో ఉపాధి హామీ పనులపై ఆరా తీశారు. ఎండలు మండుతున్న సమయంలో పనులు చేయవద్దని ఉదయం, సాయంత్రం మాత్రమే పని చేయాలని కూలీలకు సూచించారు. నియోజకవర్గంలో కూలీలకు పనులు కల్పిస్తూ ఉపాధి అందేలాగా చూడటమే ఉపాధి హామీ పథకం లక్ష్యమని వివరించారు. మండుటెండల్లో పనిచేయవద్దని, అనారోగ్యానికి గురి కావద్దని కోరారు. కూలీలకు అన్ని సదుపాయాలు సజావుగా అందించాలని మంత్రి సంబంధిత ఉద్యోగులను అదేశించారు.