హైదరాబాద్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : అత్యుత్తమ ప్రమాణాలతో ఆన్లైన్ ఆడిటింగ్‌లో తెలంగాణ ఆడిట్‌శాఖ దేశంలోనే నంబర్ వన్‌గా నిలిచిందని, వరుసగా మూడేండ్లు మొదటి ర్యాంక్ సాధించిందని డిప్యూటీ సీఎం మల్లు భట్టివిక్రమార తెలిపారు. రాష్ట్రంలో ఆన్లైన్ ఆడిటింగ్ వ్యవస్థను పరిశీలించేందుకు వచ్చిన గుజరాత్ ఆడిట్‌శాఖ ఉన్నతాధికారులతో మంగళవారం సచివాలయంలో భట్టి సమావేశమయ్యారు. రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు అత్యంత బలంగా ఉన్నాయని గుజరాత్ అధికారులకు భట్టి వివరించారు. తెలంగాణలో ఆడిట్‌శాఖ పనితీరు అధ్యయనానికి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని చెప్పారు. గత రెండ్రోజులుగా రాష్ట్రంలోని పలు గ్రామపంచాయతీలను సందర్శించి ఆన్లైన్ వ్యవస్థను అధ్యయనం చేస్తున్నామని, ఆడిటింగ్ వ్యవస్థ పారదర్శకంగా, సమర్థంగా కొనసాగుతుందని గుజరాత్ అధికారులు భట్టి విక్రమార్కకు వివరించారు. సమావేశంలో ఆర్థికశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్‌కుమార్ సుల్తానియా, ఆడిట్‌శాఖ డైరెక్టర్ నరసింహన్ తదితరులు పాల్గొన్నారు.