మహబూబ్‌నగర్, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ర్టానికి మూడేండ్లలో రూ.7,78,000 కోట్ల విదేశీ పెట్టుబడులు వచ్చాయని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌గౌడ్ వెల్లడించారు. మహబూబ్‌నగర్‌లో డీసీసీ ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమంలో మంగళవారం ఆయన పాల్గొని మాట్లాడారు. ఫోర్త్ సిటీకి మూడు రోజుల్లో రూ. 5,78,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయని తెలిపారు. బడ్జెట్‌కు మించి రాష్ట్రంలో పెట్టుబడులు వస్తున్నాయని అనడంతో అక్కడున్నవారంతా ముక్కున వేలేసుకున్నారు.
మహేశ్‌ను నిలదీసిన ఎమ్మెల్యే వర్గం
మహబూబ్‌నగర్ డీసీసీ కార్యవర్గాన్ని ఇటీవల ఆ పార్టీ అధ్యక్షుడు సంజీవ్‌కుమార్ ముదిరాజ్ ప్రకటించారు. జిల్లాలో మూడు నియోజకవర్గాలను కలుపుకొని ప్రకటించిన కార్యవర్గంలో మహబూబ్‌నగర్ ఎమ్మెల్యే వర్గానికి నిరాశ ఎదురైంది. ఈ విషయంలో డీసీసీ అధ్యక్షుడిపై పార్టీ నేతలు గుర్రుగా ఉన్నారు. తాజాగా మహేశ్‌గౌడ్‌ను జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరసింహారెడ్డి బహిరంగంగానే నిలదీశారు. పనికిరాని వాళ్లను కార్యవర్గంలోకి తీసుకున్నారని గొడవకు దిగారు.