రాజన్న సిరిసిల్ల, ఏప్రిల్ 7 (నమస్తే తెలంగాణ) : సిరిసిల్ల సహకార విద్యుత్తు సరఫరా సంస్థ (సెస్)ను కాపాడుకునేందుకు పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించింది. ఈ సంస్థ 56 ఏండ్లుగా సేవలందిస్తున్నదని, 2025 డిసెంబర్లోనే తాము తెలంగాణ విద్యుత్తు నియంత్రణ మండలికి సెస్ లైసెన్స్ రెన్యువల్ కోసం దరఖాస్తు చేసుకున్నామని, మార్చి 31 2026 లోపు రెన్యువల్ చేయాల్సి ఉన్నా చేయలేదని పాలక వర్గం పేర్కొన్నది. తమకు సమాచారం ఇవ్వకుండా ఏప్రిల్ 1న టీజీఎన్పీడీసీఎల్, టీజీ ఈఆర్సీ అధికారులు సెస్‌ను ఆధీనంలోకి తీసుకున్నట్టు పాలకవర్గం హైకోర్టును ఆశ్రయించారు. మంగళవారం హైకోర్టులో వాదనలు జరిగాయి. జస్టిస్ రేణుక ఎదుట సెస్ తరఫున మాజీ అడిషనల్ అడ్వొకేట్ జనరల్ రాంచందర్‌రావు, న్యాయవాదులు వాదనలు వినిపించారు. లైసెన్స్‌లు ఇవ్వాలని కోర్టు డైరెక్షన్ ఇవ్వదని న్యాయమూర్తి పేర్కొన్నారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఎలా వస్తారని? ప్రశ్నించారు. కేసును 2వారాలకు వాయిదా వేస్తామని జస్టిస్ చెప్పగా, పరిస్థితి దృష్ట్యా వారం రోజులే వాయిదా వేయాలని సెస్ తరఫున న్యాయవాది కోరారు. లైసెన్స్ రెన్యువల్‌కు ఎందుకు సిఫారసు చేయలేదో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. విచారణ 15కు వాయిదా వేశారు.