హైదరాబాద్, సెప్టెంబర్ 15 (నమస్తే తెలంగాణ): టీఎస్ఐఐసీ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న 50 కొత్త పారిశ్రామికవాడలు హరిత విధానాలతో పర్యావరణహితంగా ఉంటాయని ఆ సంస్థ ఎండీ ఈ వెంకట నర్సింహారెడ్డి చెప్పారు. 19,000 ఎకరాల్లో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ఏర్పాటుచేస్తున్న ఫార్మా క్లస్టర్‌ను సైతం గ్రీన్ బిల్డింగ్ మార్గదర్శకాల ప్రకారమే అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. సీఐఐ-ఐజీబీసీ వరల్డ్ గ్రీన్ బిల్డింగ్ వీక్ 2022లో భాగంగా గురువారం మాదాపూర్‌లోని సీఐఐ కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. హరితహారం ద్వారా రాష్ట్రంలో పచ్చదనం ఎనిమిదేండ్లలో 24 శాతం నుంచి 27.4 శాతానికి చేరుకుందని, త్వరలోనే 33 శాతానికి పెరుగుతుందని చెప్పారు. కార్యక్రమంలో డీటీసీపీ డైరెక్టర్ కే విద్యాధర్ తదితరులు పాల్గొన్నారు.