హైదరాబాద్, ఆగస్టు 25 (నమస్తే తెలంగాణ) : దేశీయ భాషల్లోకి మన బాలసాహిత్యాన్ని తీసుకుపోయేందుకు కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత పత్తిపాక మోహన్ కృషిచేయాలని తెలంగాణ సాహిత్య అకాడమీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ అన్నారు. గురువారం నగరంలోని సాహిత్య అకాడమీ కార్యాలయంలో మోహన్‌ను సాహితీవేత్తలు ఘనంగా సత్కరించారు. జూలూరు మాట్లాడుతూ అరుదైన బాల సాహిత్యకారుడు మోహన్ తెలంగాణ బిడ్డ కావడం గర్వకారణమన్నారు. నేటితరం పిల్లలకు పాఠశాల స్థాయి నుంచే ప్రజాస్వామ్య భావజాలం, లౌకికతత్వాన్ని నూరిపోసే కథలు, వైజ్ఞానిక కథలు అందించాల్సిన అవసరం ఉన్నదన్నారు. కార్యక్రమంలో ప్రముఖ సాహిత్య విమర్శకులు కేపీ అశోక్‌కుమార్, ఎం నారాయణ శర్మ, కాళోజీ అవార్డు గ్రహీత కోట్ల వెంకటేశ్వరరెడ్డి, జీహెచ్ఎంసీ అసిస్టెంట్ కమిషనర్ యాదగిరిరావు తదితరులు పాల్గొన్నారు.