
హైదరాబాద్ సిటీబ్యూరో, జనవరి 9 (నమస్తే తెలంగాణ): శిఖామణి.. విశిష్ట సాహితీమూర్తి అని, వచన కవిత్వంలో ఆయన ప్రత్యేక ముద్ర వేశారని అజో-విభొ-కందాళం ఫౌండేషన్ అధ్యక్షుడు అప్పాజోస్యుల సత్యనారాయణ అన్నారు. ప్రముఖ కవి, తెలుగు వర్సిటీ విశ్రాంత ప్రొఫెసర్, కవి సంధ్య పత్రిక సంపాదకుడు శిఖామణికి అజో-విభొ-కందాళం ఫౌండేషన్, ది యంగ్మెన్స్ హ్యాపీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో సాహితీ పురస్కారాన్ని శనివారం రాత్రి కాకినాడలోని దండటు కళాక్షేత్రంలో ప్రదానం చేశారు. ప్రముఖ కవి, కథకుడు దాట్ల దేవదానంరాజు అధ్యక్షతన ‘ఆచార్య కే సంజీవరావు (శిఖామణి) కృషి సమాలోచన’ సదస్సు జరిగింది. శిఖామణి రచనల విశిష్టతపై వక్తలు ప్రసంగించారు. అనుభూతి కవిత్వంపై మాకినీడి సూర్యభాస్కర్, గిజిగాడు కవితలపై అద్దేపల్లి ప్రభు, వస్తుశిల్పంపై పుప్పాల శ్రీరామ్, దళిత తాత్వికతపై అనిల్ డాని, స్మృతి కవితలపై సుంకర గోపాల్ ప్రసంగించారు. కార్యక్రమంలో ముధునాపంతుల సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.