Peddi OTT | మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా నటించిన లేటెస్ట్ బ్లాక్‌బస్టర్ ‘పెద్ది’ థియేటర్లలో సంచలన విజయాన్ని నమోదు చేస్తూ బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. చాలా కాలంగా తెలుగు సినీ పరిశ్రమ ఎదురుచూస్తున్న భారీ హిట్‌గా నిలిచిన ఈ చిత్రం ప్రేక్షకుల నుంచి అద్భుతమైన ఆదరణ పొందుతోంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ‘పెద్ది’ మేనియా ఇంకా కొనసాగుతుండగా, ఇప్పుడు ఈ సినిమా ఓటీటీ విడుదలకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. తాజా సినీ వర్గాల సమాచారం ప్రకారం, ‘పెద్ది’ ఓటీటీలో స్ట్రీమింగ్ అయ్యే వెర్షన్ థియేటర్లలో ప్రదర్శించిన వెర్షన్ కాదని, పూర్తిస్థాయి అన్‌కట్ వెర్షన్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారట. థియేట్రికల్ రన్ సమయంలో నిడివి కారణంగా లేదా కథా ప్రవాహాన్ని దృష్టిలో ఉంచుకుని తొలగించిన పలు కీలక సన్నివేశాలను తిరిగి ఓటీటీ వెర్షన్లో జోడించే అవకాశం ఉన్నట్లు టాక్ వినిపిస్తోంది.
సాధారణంగా పెద్ద సినిమాల విషయంలో డిలీట్ చేసిన సన్నివేశాలపై అభిమానుల్లో ఆసక్తి ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా హీరో క్యారెక్టర్ ఎలివేషన్స్, భావోద్వేగ సన్నివేశాలు, కథకు మరింత బలం చేకూర్చే కొన్ని ఎపిసోడ్స్ థియేటర్లలో కనిపించకపోతే వాటిని చూడాలని ప్రేక్షకులు కోరుకుంటారు. ఇప్పుడు ‘పెద్ది’ విషయంలో కూడా అదే తరహా ట్రీట్ దక్కే అవకాశం ఉందని సమాచారం రావడంతో అభిమానులు ఉత్సాహంగా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. దీంతో ఓటీటీలో విడుదలయ్యే వెర్షన్ మరింత ప్రత్యేకంగా ఉండేలా మేకర్స్ ప్రయత్నిస్తున్నారని తెలుస్తోంది. ఒకవేళ ఈ ప్రచారం నిజమైతే, థియేటర్లలో సినిమా చూసిన ప్రేక్షకులు కూడా అన్‌కట్ వెర్షన్‌ను మరోసారి ఆసక్తిగా వీక్షించే అవకాశాలు ఉన్నాయి.
దర్శకుడు బుచ్చిబాబు సాన తెరకెక్కించిన ఈ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాలో రామ్ చరణ్ తన కెరీర్లోనే విభిన్నమైన పాత్రలో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. గ్రామీణ నేపథ్యంతో పాటు క్రీడా అంశాలను మేళవిస్తూ రూపొందించిన కథకు ప్రేక్షకులు విశేష ఆదరణ అందించారు. సినిమాలో భావోద్వేగాలు, యాక్షన్ ఎపిసోడ్స్, సంగీతం ప్రధాన ఆకర్షణలుగా నిలిచాయి. ఈ చిత్రంలో బాలీవుడ్ నటి జాన్వీ కపూర్ హీరోయిన్గా నటించగా, లెజెండరీ సంగీత దర్శకుడు ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. రెహమాన్ కంపోజ్ చేసిన పాటలు, నేపథ్య సంగీతం సినిమాకు మరింత బలం చేకూర్చాయి. వృద్ది సినిమాస్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఈ చిత్రం ప్రస్తుతం బాక్సాఫీస్‌ని షేక్ చేస్తుంది..