కాలాపానీ.. దీన్నే సెల్యులార్ జైలు అని పిలుస్తారు. అండమాన్ నికోబార్ దీవుల్లో ఉన్న ప్రవాస కారాగారం. స్వాతంత్య్రోద్యమ కాలంలో రాజకీయ ఖైదీలను ప్రధాన భూభాగానికి దూరంగా బహిష్కరించేందుకు బ్రిటిషర్లు ఈ జైలును ఉపయోగించారు. స్వాతంత్య్ర పోరాటంలో బటుకేశ్వర్ దత్, యోగేంద్ర శుక్లా, వీఓ చిదంబరం పిళ్ళై, సహా పలువురు ఉద్యమకారులు ఇక్కడ జైలు పాలయ్యారు. బ్రిటిష్ రెసిడెంట్పై తుర్రెబాజ్ఖాన్తో కలిసి దాడిచేసిన హైదరాబాద్ యోధుడు మౌల్వీ అల్లాఉద్దీన్ను ఇక్కడే బంధించారు. మౌల్వీ ఇక్కడే 28 ఏళ్లు జైలు శిక్ష అనుభవించారు. ఈ జైలులోనే కన్నుమూశారు. రెండో ప్రపంచ యుద్ధంలో జపాన్ ఆధీనంలోకి వచ్చిన అండమాన్పై ఆజాద్హింద్ ఫౌజ్ పతాకం రెపరెపలాడింది. ఈ సముదాయం ప్రస్తుతం జాతీయస్మారక కట్టడంగా గుర్తింపు పొందింది.