సత్తుపల్లిటౌన్ (ఖమ్మం): అహింసామార్గంలో పోరాడి దేశానికి స్వాతంత్య్రం తెచ్చిన మహాత్ముడంటే అతడికి కొండంత భక్తి. అందుకే గాంధీజీకి ఇంట్లోనే గుడికట్టి దేవుడిలా కొలుస్తున్నాడు ఖమ్మం జిల్లా సత్తుపల్లి పట్టణానికి చెందిన పిండిబోయిన కొండబాబు. చిన్నప్పుడు తండ్రి చెప్పిన గాంధీజీ జీవిత చరిత్ర విని, మహాత్ముడికి భక్తుడిగా మారిపోయాడు. ఆటో డ్రైవర్గా జీవిస్తూనే గాంధీ బోధనలను అనుసరిస్తున్నాడు. ఇంట్లోనే గుడికట్టి రూ.12వేల ఖర్చుతో తయారుచేయించిన మహాత్ముడి విగ్రహాన్ని ప్రతిష్టించాడు. ప్రతిరోజూ మహాత్ముడికి పూజలు చేస్తున్నాడు. గాంధీజీ జయంతి, వర్ధంతి రోజున సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నాడు.
నేను ఎప్పుడైనా నిస్పృహకు గురైనప్పుడు సత్యం, ప్రేమ చరిత్ర పొడవునా ఎల్లప్పుడూ అంతిమ విజయం సాధించాయన్న సంగతిని గుర్తుచేసుకొంటాను. ఎందరో నియంతలు, నరహంతలు వచ్చారు. కానీ వారు నిలబడింది కొంతకాలమే. ఆ పరిమిత కాలంలో వారు అప్రతిహతులుగా కనిపించవచ్చు. కానీ చివరకు మట్టి కరిచారు. దీనిని ఎల్లప్పుడూ మనసులో ఉంచుకోండి.
– మహాత్మా గాంధీ