యాదాద్రి, ఆగస్టు 8 : యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి స్వయంభు ప్రధానాలయంలో రెండో రోజైన సోమవారం పవిత్రోత్సవాలను పాంచరాత్రాగమశాస్త్ర రీతిలో నిర్వహించారు. స్వామివారి ప్రధానాలయ వెలుపలి ప్రాకార మండపంలో ఉత్సవమూర్తులకు అర్చకులు తిరుమంజనాలు చేశారు. స్వామిని పట్టువస్ర్తాలు, బంగారు, ముత్యాల ఆభరణాలతో అలంకరించి 108 నూలు దారాలతో తయారు చేసిన పవిత్ర మాలలను పుణ్య జలాలతో సంప్రోక్షించి పూజలు చేశారు. అనంతరం స్వామివారికి శాంతి హోమం చేశారు. స్వామి, అమ్మవార్లకు మూల, ముక్తి మంత్రాలు, వేదమంత్ర పఠనాలతో హవన పూజలు చేశారు. పూర్ణాహుతి పర్వాలను నిర్వహించి పవిత్ర మాలలతో ప్రధానాలయం చుట్టూ ప్రదక్షిణ చేసి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం మూర్తికుంభ ఆరాధన, పవిత్రమాలల ఆరాధనలు జరిపి పవిత్ర మాలలను కవచమూర్తులకు అలంకరించారు. పాతగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలోనూ పూజలు నిర్వహించారు. గుట్టలో శ్రావణలక్ష్మి కోటి కుంకుమార్చన వేడుకలు 11వ రోజుకు చేరాయి. స్వామివారిని 20 వేల మంది భక్తులు దర్శించుకొన్నట్టు ఈవో గీత తెలిపారు.