హైదరాబాద్, మార్చి 29 (నమస్తే తెలంగాణ): తెలంగాణలో ఎంపీ టికెట్ల కేటాయింపులో కాంగ్రెస్ పార్టీ మాదిగలకు అన్యాయం చేసిందని మాదిగ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేశాయి. శుక్రవారం ఢిల్లీలోని ఏఐసీసీ ప్రధాన కార్యాలయం వద్ద తెలంగాణకు చెందిన పలు మాదిగ సంఘాలు నిరసన వ్యక్తంచేశాయి. ఏఐసీసీ కార్యదర్శులు రోహిత్ధురి, బిజేంద్రసింగ్ను ఆయా సంఘాల నేతలు కలిసి వినతిపత్రం అందజేశారు. పెద్దపల్లి అభ్యర్థిని మార్చి గజ్జెల కాంతంకు అవకాశం ఇవ్వాలని, వరంగల్ టికెట్‌ను మాదిగలకు ఇవ్వాలని, సికింద్రాబాద్ కంటోన్మెంట్లో పిడమర్తి రవికి కేటాయించాలని డిమాండ్ చేశారు. 18 లక్షలు ఉన్న మాల సామాజికవర్గానికి ఎకువ సీట్లు కేటాయించారని, 80 లక్షలకుపైగా ఉన్న మాదిగలకు అన్యాయం చేశారని వివరించారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జునఖర్గేను కూడా కలిసి జరిగిన అన్యాయాన్ని వివరిస్తామని చెప్పారు.