Karimnagar Simha Garjana | కనుచూపు మేర అంతా అంధకారమే.. ఎటుచూసినా ప్రతికూలతలే! గత కాలపు గాయాలు వెన్నాడే వైఫల్యాలు.. ఆవెంటే అపనమ్మకాలు… మెజారిటీ ఆధిపత్య వాదా లు.. వేళ్లూనుకున్న ‘జాతి’ సిద్ధాంతాలు.. సొంత గడ్డమీదే బానిస బాధిత బతుకు బతుకుతున్న పౌరులు. ఇది 22 ఏండ్ల క్రితం కేసీఆర్ తెలంగాణ జెండా ఎత్తినప్పటి పరిస్థితి.
ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 2001 ఏప్రిల్ 27న జలదృశ్యంలో గులాబీ జెండా ఎగురవేసిన కేసీఆర్, ఆ తర్వాత సరిగ్గా 20 రోజులకు, 2001 మే 17న గురువారం రోజున కరీంనగర్లో సింహగర్జన వినిపించారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ సాధనలో మొట్టమొదటిదైన ఆ బహిరంగసభకు లక్షలాదిగా జనం స్వచ్ఛందంగా తరలివచ్చి తెలంగాణ రాష్ట్రం ఇవ్వాల్సిందే అంటూ తీర్మానించారు. 22 ఏండ్ల క్రితం కేసీఆర్ ఆ సభలో గంటసేపు చేసిన ప్రసంగం తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని చెప్పడమే కాదు, తెలంగాణ రాష్ట్రం – సాధన విషయంలో ఉన్న అపోహలను కూడా నివృత్తి చేశారు.
తను పుట్టిన నేలను ప్రేమించే ఒక భూమి పుత్రుడు తన నేల తల్లి బంధనాలను ఎలా విముక్తం చేశాడన్నదానికి 22 ఏండ్ల కేసీఆర్ ప్రస్థానం.. నేటి తెలంగాణ ప్రగతి ప్రతిబింబం. తెలంగాణకు జరిగిన మేలేమిటో మనకండ్ల ముందు ఉన్నది. తెలంగాణ రాష్ర్టాన్ని ఇలా సాధిస్తానంటూ 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటను 13 ఏండ్ల తర్వాత ఆయన నిజం చేశారు. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిపై 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటల్ని రాష్ట్రాన్ని సాధించిన పదేండ్లలో నిజం చేసి చూపించారు. తెలంగాణ విజయ నాదం ఈ రోజు దేశమంతా ప్రతిధ్వనిస్తున్నది. మన తెలంగాణ సగర్వంగా సమున్నతంగా దశాబ్ది వేడుకలకు సన్నద్ధమవుతున్నది. ఈ సుందర సన్నివేశాన్ని కేసీఆర్ 22 ఏండ్ల క్రితమే ఎట్లా కలగన్నడు? అన్నది గుర్తించాలంటే కేసీఆర్ అప్పుడేమన్నాడో మరొక్కమారు వినాల్సిందే. 22 ఏండ్ల క్రితం సరిగ్గా ఇదే రోజున కరీంనగర్ సింహగర్జన సభలో కేసీఆర్ ప్రసంగ సారాంశం
శతాబ్దాలు, దశాబ్దాల తరబడి స్వాతంత్య్ర సమరాలు, విముక్తి పోరాటాలు, సాయుధ ఉద్యమాలు సాగి కత్తులాట, కుత్తుకల వేటతో నెత్తురోడిన నేలకు 22 ఏండ్ల కాలం ఇంకా చిన్నది! ఒక సంకల్పాన్ని స్వప్నించి, స్వప్న సాధనకు ఉద్యమించి, ఉద్యమ కాలంలోనే ప్రగతి ఎజెండాను ప్రకటించి, ప్రకటించిన ఎజెండాకు ప్రణాళికలు కూర్చి, కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో అమలు చేసి… ‘ఇదిరా నా తెలంగాణ.. భళిరా నా తెలంగాణ’ అని బాహుబలిలా సగర్వంగా చాటుకోవడం మాత్రం చిన్న పని కాదు.
కేవలం 22 ఏండ్లలోనే దీన్ని చేసి చూపించడం ఎంతమాత్రం చిన్నది కాదు. నిన్నటి మాటకు నేటితో కాలం చెల్లుతున్న సమకాలీన రాజకీయాల్లో, 22 ఏండ్ల క్రితం చెప్పిన మాటకు తప్పకుండా ఇప్పటిదాకా కట్టుబడి ఉండడం ఎంతో అరుదు. ఆ ఆరుదైన ఘనత సాధించిన నాయకుడు కేసీఆర్.
తెలంగాణకు ప్రత్యేక రాష్ట్ర హోదా కోసం 2001 ఏప్రిల్ 27న జల దృశ్యంలో తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించిన కేసీఆర్, ఆ తర్వాత 20 రోజులకే, మే 17న కరీంనగర్లో సింహగర్జన సభ నిర్వహించారు. అప్పటిదాకా ఎర్రజెండాల రెపరెపలే చూసిన తెలంగాణ రహదారి, ఆనాడు కేసీఆర్ హైదరాబాద్ నుంచి కరీంనగర్ ప్రయాణిస్తుంటే, 8 గంటలపాటు, దారిపొడవునా గులాబీ పతాకాల గుబాళింపులే!
ధన బలం లేదు. రాజకీయ బలగం పెద్దగా లేదు. అయినా ఒక మనిషిని నమ్మి సభా స్థలికి పోటెత్తిన జనం. తనను కన్నభూమి తెలంగాణ ఎందుకిలా గోస పడుతున్నదన్న ఆవేదన, మాతృభూమిపై గుండెల నిండా పొంగే తెలంగాణ ప్రేమ, రాష్ర్టాన్ని సాధించాలన్న నిండైన పట్టుదల, ప్రజలు అండగా ఉంటారన్న భరోసా… ఈ నాలుగే కేసీఆర్‌ను నడిపించిన నాలుగు రథ చక్రాలు!
సెల్‌ఫోన్ మాయా ప్రవాహంలో కొట్టుకుపోతున్న తెలంగాణ యువజనానికి 24 ఏండ్ల క్రితం కేసీఆర్ ఏమన్నాడో తెల్వదు. అన్న ప్రతి ఒక్కదాన్నీ ఎలా నిజం చేశాడో అంతకంటే తెల్వదు. వారికే కాదు; ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించి, అభివృద్ధి చేసి, కల్పించిన సౌకర్యాల సౌఖ్యంలో మునిగిపోయి, నిన్నటి కష్టాన్ని మరిచి, విమర్శను అలవాటుగా మార్చుకున్నవారూ 24 ఏండ్ల క్రితం కేసీఆర్ ఏమన్నాడో… ఎలా దాన్ని సాధించి చూపెట్టాడో విస్మరించారు. ఇలాంటివారందరి కోసం 24 ఏండ్ల క్రితం కరీంనగర్ సింహగర్జన సభలో కేసీఆర్ గంట సేపు చేసిన ప్రసంగ సారాంశాన్ని ప్రచురిస్తున్నాం. ఎంత దార్శనికత ఉంటే, ఎంత నమ్మకం ఉంటే, ఎంత ప్రణాళిక ఉంటే, ఎంత ముందు చూపు ఉంటే తప్ప ఇలాంటి ప్రసంగం చేయగలరు?!
నా ప్రాణం పోయినా సరే.. ప్రత్యేక తెలంగాణను సాధించి తీరుతా. ఉద్యమానికి వెన్నుపోటు పొడిచే సమస్యే లేదు. ఒకవేళ అలాంటి పనికి గనుక నేనుగాని నాతోపాటు ఈ వేదికపై కూర్చున్న నాయకులుగాని పాల్పడితే మమ్మల్ని రాళ్లతో కొట్టి చంపండి. రేపటి తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో భూకంపం వచ్చింది. ఈ భూకంపం నుంచి వేలాది గులాబీ పూలు పుట్టుకొచ్చాయి. నేను ఈరోజు హైదాబాద్‌లో బయల్దేరి కరీంనగర్ వస్తుంటే ఎక్కడ చూసినా ఈ గులాబీ పూలే కనిపించాయి. ఈ భూకంపంలో కొన్ని రాజకీయ వలసలు కూడా ప్రారంభమయ్యాయి.
నేను బక్కపల్చగా ఉండవచ్చు కానీ మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం. ఇదే సహకారం, మద్దతు అందిస్తే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఈ లక్ష్యసాధనలో వెనుకడుగు వేస్తే నన్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులెవరినైనా ప్రజలు రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఉద్యమ నిర్మాణంలో చిత్తశుద్ధి చూపని నాయకులను నిలదీసే విధంగా తెలంగాణ ప్రజానీకంలో చైతన్యం తీసుకురావడం మా లక్ష్యం. ‘తెలంగాణ సింహగర్జన’ సభ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరుతున్నది. ఇన్నేళ్లుగా దగాపడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే వరకు మూడుకోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారు.
గత 44 ఏండ్ల చరిత్రలో తెలంగాణకు ఏ రంగంలో చూసినా పూర్తిగా అన్యాయమే జరిగింది. నిలువెల్లా గాయాలతో ఈ ప్రాంతం కంటతడితో కనిపిస్తున్నది. తెలంగాణ ప్రజల మనోభావాలను పాలకులు పట్టించుకోవటం లేదు. ఇష్టమొచ్చిన నిర్ణయాలు తీసుకుంటూ పాలన సాగిస్తున్నారు. అందుకే ఈనాడు తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. అనేక ప్రజా ఉద్యమాలకు నిలయమైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడే వరకు ఈ ఉద్యమం ఆగదు. తెలంగాణను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తున్నామని ముఖ్యమంత్రి చెబుతున్నారు. కానీ, తెలంగాణ రైతుల సమస్యల పరిష్కారంపై ఆయన ఏనాడు చొరవ చూపలేదు.
తెలంగాణ కోసం గతంలో జరిగిన ఉద్యమంలోని చివరి అంకాన్ని పదే పదే ఎత్తి చూపుతూ స్వార్థం, పదవులను గుర్తు చేస్తూ చిన్నబుచ్చే మాటలు చెబుతున్నారు. ఉద్యమంపై వదంతులు పుట్టించి, పదవులకు లంకె పెడుతున్నారు. అదే ఉద్యమంలోని ఘనమైన త్యాగాల చరిత్రను మరుగు పరుస్తున్నారు. మన చరిత్రను, సంస్కృతిని వక్రీకరిస్తున్నారు. తెలుగు సినిమాల్లో విలన్లకు, జోకర్లకు తెలంగాణ యాసను ఉపయోగిస్తున్నారు. మన సంస్కృతి, భాషను అవహేళన చేస్తున్నారు. త్యాగాలు లేని గడ్డగా తెలంగాణ చరిత్రను కొందరు పని గట్టుకొని ప్రచారం చేస్తున్నారు. ప్రస్తుత ఉద్యమం చేపట్టే ముందు ప్రపంచవ్యాప్తంగా జరిగిన ఎన్నో ఉద్యమాల చరిత్రను చదివాను. ఏ పోరాటం ఎందుకు విజయవంతమైందో, ఏ పోరాటం ఎందుకు విఫలమైందో క్షుణ్ణంగా తెలుసుకున్నా. విఫలమైన పోరాట చరిత్రల నుంచి గుణపాఠాలు నేర్చుకొని, విజయవంతంగా పోరాటం ఎలా జరుపాలో నాకు తెలుసు. ఈసారి ఉద్యమం గ్రామం, మండలం, జిల్లా స్థాయి కమిటీలతో పకడ్బందీ వ్యవస్థతో ముందుకు సాగుతుంది. ఇరవై రోజుల కింద ఏర్పాటైన తెలంగాణ రాష్ట్ర సమితికి అనూహ్యమైన స్పందన లభిస్తున్నది. సింహగర్జనకు తరలి వచ్చిన జనవాహినే ఇందుకు నిదర్శనం. తెలంగాణ రాష్ట్రం కావాలని ప్రజలు కోరుకోవటం లేదని పాలకులు అంటున్నారు. కానీ, ఇక్కడ బహిరంగసభకు ఇంతపెద్ద ఎత్తున జనం హాజరైంది తెలంగాణ కోసమే! రాళ్లు విసిరి హింసకు పాల్పడటం కాక, వ్యూహాత్మకంగా ప్రజాసేనలను నడిపించి రాష్ర్టాన్ని సాధించడమే మన ఉద్యమ లక్ష్యం.
ఈ భూకంపం తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు వైఖరిలో మార్పు వచ్చింది. ఇంతకుముందు తెలంగాణ ఎమ్మెల్యేలు, మంత్రులు వంగి వంగి దండాలు పెట్టినా వెనుతిరిగి చూడని ముఖ్యమంత్రి ఇప్పుడు తెలంగాణ నాయకులను పిలిచి మీకు స్వీట్లు కావాలా? కూల్ డ్రింకా? హాట్ డ్రింకా? అని అడుగుతున్నారు. ఈ మూణ్ణాళ్ల ముచ్చట చూసి మోసపోవద్దు. తెలంగాణకు జరిగిన అన్యాయం గురించి నేను సంధించిన ఎన్నో ప్రశ్నలకు ముఖ్యమంత్రి ఇప్పటికీ సమాధానం చెప్పలేదు.
ఎంపీలకు కేంద్రంలో మంత్రి పదవులొస్తే ఎదిగిపోతారనే భయంతోనే చంద్రబాబు ఎన్డీఏలో చేరలేదు. తన పదవి కోసం మామను చంపి, బామ్మర్దులను, సడ్డకున్ని శంకరగిరిమాన్యాలకు పట్టించారు ఆయన. కానీ, నేను తెలంగాణ కోసం మాట్లాడితే పదవుల కోసమే మాట్లాడుతున్నట్టు విమర్శిస్తున్నారు.
ఇంతకు ముందే ప్రత్యేక రాష్ట్రంగా ఉన్న తెలంగాణ కోస్తాంధ్రలో విలీనమై, ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడడానికి కాంగ్రెస్ పార్టీ కారణం. తర్వాత సుమారు పన్నెండు సంవత్సరాలకు వచ్చిన ఉద్యమం త్యాగాలు, బలిదానాలతో సాగినా నాటి కాంగ్రెస్ నాయకత్వమే ప్రజాభిప్రాయాన్ని కాలరాసి ద్రోహం చేసింది. ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యేలు తెలంగాణ కోసం పట్టుపడుతున్నా ఢిల్లీ దర్బార్ వద్ద మోకరిల్లి దేహీ అనడం సబబుగా లేదు. అల్టిమేటం జారీ చేయాలి. బీజేపీ తెలంగాణ విషయంలో మాట తప్పటమేకాక పచ్చి అబద్ధాలు చెబుతున్నది.
ఒక ఓటు రెండు రాష్ర్టాలని, తెలంగాణకు కట్టుబడి ఉన్నామని తీర్మానాలు చేసిన ఆ పార్టీ ఇప్పుడు వెనక్కి తగ్గింది. రాష్ట్ర ఏర్పాటుకు అసెంబ్లీలో తీర్మానం చేయాలని రాజ్యాంగంలో లేని మాటలను చెబుతూ కొత్త మోసానికి బీజేపీ సన్నద్ధమవుతున్నది. తెలంగాణకు చెందిన మొత్తం 107 మంది ఎమ్మెల్యే లు ఏకాభిప్రాయంతో ఉన్నా మిగతా ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తే తీర్మానానికి అవకాశమే ఉండదు. అసెంబ్లీ తీర్మానం అవసరం లేదని గుజరాత్ ఏర్పాటు సమయంలో సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పు ఇచ్చింది. బీజేపీ నాయకులు ఈ విషయాన్ని సాగదీస్తే నేను కేసువేస్తా. ఇక కమ్యూనిస్టులు పడికట్టు పదాలతో వాస్తవాలను గ్రహించకుండా, వారు అయోమయం చెందడంతోపాటు ఇతరులను అయోమయానికి గురి చేస్తున్నారు.
చంద్రబాబు పాలనలో ప్రచారం తప్ప ప్రజాభిప్రాయానికి , ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యం లేకుండా పోయింది. తెలంగాణ విషయంలో తీవ్ర వివక్ష చూపడమే కాక ఇప్పటికీ మోసపూరిత మాటలతో ప్రజలను వంచించేందుకు యత్నిస్తున్నారు. పంచరంగుల ప్రచారాన్ని నమ్ముతూ మనం మౌనంగా ఉందామా? మళ్లీ మళ్లీ తెలుగుదేశం చేతుల్లో మోసపోదామా? ఇచ్చంపల్లి ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తామంటున్నారు ముఖ్యమంత్రి. దానికి కేంద్ర జలసంఘం అనుమతి ఉందా? అంతరాష్ట్ర వివాదం తొలగిందా? బడ్జెట్లో రూపాయైనా కేటాయించారా? ఈ ప్రశ్నలకు ఆయన సమాధానమివ్వాలి. విశాఖ ఉక్కు పరిశ్రమ మూతపడకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చిన చంద్రబాబు రామగుండం ఎఫ్‌సీఐ మూతపడుతుంటే కళ్లు మూసుకున్నారా? చంద్రబాబు ప్రచారానికి హద్దులు లేవు. తెలంగాణ ప్రజలకు ఇంకుడు గుంతలు, కోస్తా ప్రజలకు నదులు, కాల్వలా? రాష్ట్రంలోని ఏ మార్కెట్ యార్డులోనైనా ధాన్యానికి కనీస మద్ధతు ధర లభిస్తున్నదా? అనే ప్రశ్నకు ముఖ్యమంత్రి సమాధానమివ్వాలి.
తెలంగాణ కోసం ఢిల్లీ సర్కారును దేబిరించాల్సిన అవసరమే లేదు. ఢిల్లీ సర్కారే మన కాళ్ల వద్దకు వచ్చి తెలంగాణ రాష్ర్టాన్ని ఇస్తుంది. పంచాయతీ ఎన్నికల్లో పునాదులు ఏర్పాటు చేసుకొని, పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించడం ద్వారా ఢిల్లీ సర్కారే కాళ్ల బేరానికి వచ్చి తెలంగాణను ప్రసాదించే పరిస్థితి కల్పిస్తాం. కరీంనగర్ సింహగర్జన విజయవంతమైంది. రెండో విడుత పోరాటాన్ని ప్రజల్లోకి ఉద్యమాన్ని తీసుకెళ్లటం ద్వారా నిర్వహిస్తాం. వెయ్యిమంది చంద్రబాబు నాయుడులు అడ్డు వచ్చినా తెలంగాణ ఏర్పాటును ఆపలేరు.
చంద్రబాబు నాయుడి ఆరేండ్ల పాలనలో తెలంగాణ ప్రజల బాధలు మరింత పెరిగాయి. చంద్రబాబు తెచ్చిన సంస్కరణలతో తెలంగాణ మరింత దగా పడింది. ఎన్టీఆర్ సీఎంగా ఉన్న సమయంలో జారీ చేసిన జీవో 610ను నేటికీ అమలు చేయటం లేదు. ఇతర ప్రాంతాలకు చెందిన ఉద్యోగులు 60 వేల మంది తెలంగాణలో ఉన్నారు. జీవో అమలైతే, వారు వారి ప్రాంతాలకు వెళ్లాల్సిందే. అప్పుడు తెలంగాణ నిరుద్యోగులకు ఉద్యోగాలు లభిస్తాయి. ఈ జీవో అమలు కోసం యువతీ యువకులు తెలుగుదేశం ఎమ్మెల్యేలను, ఎంపీలను నిలదీయాలి.
నక్సలైట్ల వల్ల తెలంగాణలో అభివృద్ధి జరగటం లేదని ముఖ్యమంత్రి చెప్పిన మాటలు బూటకం. వారి వల్లే అభివృద్ధి ఆగితే ఎన్టీపీసీ, అడవిలో ఉన్న ఏపీ రేయాన్స్ ఫ్యాక్టరీ, కేటీపీఎస్ ఎలా నడుస్తున్నాయి? తెలంగాణలో ఉన్న ఆజంజాహీ మిల్లు, అంతర్గాం, నిజాం చక్కెర ఫ్యాక్టరీ కనుమరుగవుతున్నాయి. విద్యుత్‌బోర్డుకు సంబంధించి తెలంగాణలో ఉన్న ఆస్తులను తమ పార్టీకి చందాలు ఇచ్చే వాళ్లకు తక్కువ ధరకు అమ్మేందుకు సిద్ధమయ్యారు.
వ్యవసాయానికి ఉచిత విద్యుత్ సాధ్యమే. పొరుగు రాష్ట్రం గత పదేండ్లుగా ఇస్తున్నప్పుడు ఇక్కడ ఎందుకు సాధ్యం కాదు. ప్రభుత్వ పథకాలైన ‘ముందుడుగు’ వెనుకడుగు వేసింది, ‘రోష్ని’ అంధకారంలో ఉంది. తెలంగాణకు జరుగుతున్న మోసం నుంచి విముక్తి పొంది అభివృద్ధి సాధించడం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంతోనే సాధ్యం. తెలంగాణకు గతం నుంచి జరుగుతున్న అన్యాయాలపై గత ఆరు నెలలుగా అనేక రకాలుగా చర్చించిన తర్వాత, త్యాగాల వల్లే ఉద్యమాలు నిలుస్తాయని నమ్మి నా పదవులను గడ్డిపోచలా వదులుకున్నా.
వ్యూహాత్మకంగా ముందుకు సాగి రాష్ట్రం సాధించుకోవలసి ఉంది. ఆవేశం ముఖ్యం కాదు. ఆలోచన అవసరం. తెలంగాణ రక్తంలో వాడివేడి ఉన్నాయే తప్ప వెన్నుపోటు గుణం లేదు. మాది రాష్ట్రం కోసం పోరాటమే తప్ప వీధుల్లో రాళ్లు విసిరే నైజం కాదు. ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర పోరాట ఉద్యమం నుంచి ఎదిగిన వెంకయ్య నాయుడు, చంద్రబాబు నాయుడులకు తెలంగాణ ఉద్యమానికి వ్యతిరేకంగా మాట్లాడే నైతిక హక్కు లేదు.
శాంతియుతంగా, ప్రజాస్వామ్యబద్ధంగా ముందుకు సాగి పంచాయతీ ఎన్నికల్లో పరిపూర్ణ విజయం సాధించడం ద్వారా తెలంగాణ రాష్ట్ర సమితి పునాదులు పటిష్ఠం చేద్దాం. ప్రస్తుత లోక్‌సభ ఐదేండ్లు కొనసాగదు. ఎప్పుడు మధ్యంతర ఎన్నికలు వచ్చినా అందరూ సిద్ధంగా ఉండాలి. పార్లమెంటు ఎన్నికల్లో విజయం సాధించటం ద్వారా ఢిల్లీ సర్కారు కాళ్ల బేరానికి వచ్చి, తెలంగాణను ప్రసాదించే పరిస్థితి కల్పిస్తాం.
నేను బక్కపల్చగా ఉండవచ్చు కానీ మూడు కోట్ల మంది తెలంగాణ ప్రజల మద్దతే నాకున్న బలం. ఇదే సహకారం, మద్దతు అందిస్తే శాంతియుతంగా, ప్రజాస్వామ్య పద్ధతిలో ప్రత్యేక రాష్ట్రం సాధించి తీరుతాం. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధం. ఈ లక్ష్యసాధనలో వెనుకడుగు వేస్తే నన్నే కాకుండా తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులెవరినైనా ప్రజలు రాళ్లతో కొట్టి చంపవచ్చు. ఇన్నేండ్లుగా దగా పడ్డ తెలంగాణ ఇక మౌనంగా ఉండలేదు. ప్రత్యేక రాష్ర్టాన్ని సాధించే వరకు మూడుకోట్ల ప్రజలు సింహాలై గర్జిస్తారు.
– సింహగర్జన సభలో కేసీఆర్