Telangana | హైదరాబాద్, అక్టోబర్ 22 (నమస్తే తెలంగాణ): ‘హలో బ్రదర్.. వాట్ ఈజ్ ఎస్ఎఫ్టీ రేట్ హియర్? హౌమచ్ రెంట్ ఫర్ టూ బీహెచ్‌కే?’.. దక్షిణ కొరియా పర్యటనలో ఉన్న తెలంగాణ ప్రభుత్వ బృందంలో కొందరు సభ్యులు ఆరా తీస్తున్న విషయాలివి. హాన్ నది, చుంగ్గై చూన్ నదీ తీరాలను పరిశీలించేందుకు వెళ్లిన తెలంగాణ మంత్రులు, అధికారులు, పాత్రికేయుల బృందం మంగళవారం కూడా అక్కడి ప్రాంతాలను పరిశీలించింది. హాన్ నది చుట్టూ ఉన్న ప్రాంతాన్ని, ఎస్టీపీల పనితీరును స్థానిక అధికారులతో కలిసి పరిశీలించారు పర్యటన అరపూటలోనే పూర్తికావడంతో ఈ బృందంలోని కొందరు హాన్ నది సమీపంలో రియల్ ఎస్టేట్ వ్యాపారం గురించే ఎక్కువగా ఆరా తీయడం గమనార్హం.
దక్షిణ కొరియాలో ఉన్న రియల్ ఎస్టేట్ విధానం, భవనాలకు అనుమతులు ఇస్తున్న తీరుపై ఒకరిద్దరు ప్రజాప్రతినిధులు, అధికారులు ఆసక్తిని కనపరిచారు. దీంతో నది, ఎస్టీపీల గురించి పెద్దగా తెలుసుకునేది ఏమీ లేదన్న భావనతో సియోల్ నగరంలో ఉన్న కొన్ని రియల్ ఎస్టేట్ కంపెనీలతో పలు విషయాలపై చర్చించినట్టు తెలిసింది. పర్యటన సమయంలోనూ భూముల ధరల గురించే ఆసక్తి చూపారని తెలిసింది. దక్షిణ కొరియా లో రియల్ ఎస్టేట్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ఇక్కడి చట్టాలు సహకరిస్తాయా అని కూడా ఆరాతీసినట్టు ఈ బృందంలోని ఒక సభ్యుడు ‘నమస్తే తెలంగాణ’తో చెప్పారు.
మార్కెటింగ్ వ్యాపారాలపై లెక్కలు
హాన్, చుంగ్గై చూన్ నదుల చుట్టూ ఉన్న షాపింగ్ కాంప్లెక్స్‌లకు కిరాయి ఎంతుంటుంది? నదుల చుట్టూ ఉన్న షాపింగ్ మాల్స్‌లో ఎంత వ్యాపారం జరుగుతుందన్నదనే విషయాలపైనే ప్రధానంగా ఫోకస్ పెట్టారు. ఆఫీస్ స్పేస్ అద్దెలు ఎలా ఉన్నాయని పలుచోట్ల వాకబు చేశారు. మూసీ చుట్టూ కూడా భారీ ఎత్తున ఇలాగే భవనాలు నిర్మించాలని, తద్వారా ఎంతవరకు ఆదాయం వస్తుందనే విషయంపైనే వారిలో ఎక్కువ చర్చ జరిగిందట. ఎన్ని షాపింగ్ కాంప్లెక్స్‌లు కట్టొచ్చు, ఎన్ని ప్రైవేటు సంస్థలకు, కార్యాలయాలకు స్థలాలు ఇవ్వొచ్చన్న దానిపైనా లెక్కలు వేసుకున్నట్టు తెలిసింది. రెస్టారెంట్లు, హోటళ్లను ఎలా నిర్మించా రు? వాటి లీజు పద్ధతిపైనా అధికారులతో మంత్రులు సమీక్ష చేసినట్టు సమాచారం.
మూసీ పేరిట రియల్ ఎస్టేట్ పన్నాగం!
భవనాల నిర్మాణం, షాపింగ్ కాంప్లెక్స్‌ల ఏర్పాటు, టూరిజం, హోటళ్ల నిర్మాణాలు.. సియోల్‌లో పర్యటనలో ఉన్న మంత్రులు రెండు రోజులుగా ఎక్కువగా మాట్లాడుతున్న విషయాలు. మూసీ పక్కన ఇప్పుడున్న ఇండ్లను ఖాళీ చేయించి ఆ స్థలాలను పెద్ద సంస్థలకు ఇచ్చే పన్నాగం స్పష్టంగా కనిపిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసమే సియోల్ పర్యటనకు వెళ్లినట్టు ఉన్నట్టు కనిపిస్తున్నదని చెప్తున్నారు.పేరుకు మీడియా ప్రతినిధులను వెంట పెట్టుకొని వెళ్లినప్పటికీ మంత్రులు తమ పర్యటన, సమావేశాలను వేరుగా పెట్టుకున్నారు. మీడియా బృందాన్ని వేరే హోటళ్లలో పెట్టి, మంత్రులు, అధికారులు వేరే హోటళ్లలో బస చేశారు. మీడియాకు నదులను చూపిస్తూ, మంత్రులు మాత్రం అక్కడ వేరే వ్యాపార వర్గాలతో భేటీలు అవుతున్నట్టు చెప్తున్నారు. కాకతీయ టెక్స్టైల్ పార్క్‌లో పెట్టుబడులు పెట్టిన యంగ్వన్ కంపెనీతో మంగళవారం వారిలో కొందరు భేటీ అయ్యారు.
ఓయో రూముల్లాంటి గదుల్లో పాత్రికేయులు
పాత్రికేయుల కోసం కేటాయించిన గదులు మన దేశంలోని ఓయో రూముల్లా చాలా చిన్నగా ఉన్నాయి. ఆ రూముల్లోనే వారు సరిపెట్టుకున్నారు. మంత్రులేమో లగ్జరీ హోటళ్లలో బసచేశారు. అక్కడి వాతావరణంపై సరైన అవగాహన లేక చాలామంది పాత్రికేయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. చలి, వర్షం ఉండటంతో మంగళవారం కొందరు ఇబ్బందిపడ్డారు. సరైన భోజన వసతి లేకపోవ డం, మన వంటకాలు ఉండే హోటళ్లకు తీసుకెళ్లకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.